జానీ మాస్టర్‌కి ఇచ్చిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ ప్రకటించింది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదుకావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ కేసులో జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు వస్తే – అప్పుడు యతాతథంగా అవార్డుని జానీ మాస్టర్‌కు అందజేస్తారు. ఇదీ సంగతి.
అయితే.. వృత్తిగత జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య లింకేంటన్నది చాలామంది ప్రశ్నిస్తున్నారు. జానీ బెస్ట్ డాన్స్ మాస్టర్ అవునా, కాదా? అనేది ఓ కమిటీ నిర్ణయించింది. అవార్డు ప్రకటించింది. మధ్యలో ఈ కేసు గొడవ బయటకు వచ్చింది. ఒకవేళ అప్పటికే జానీ మాస్టర్‌కు అవార్డు ఇచ్చేస్తే, ఆ తరవాతే కేసు సంగతి బయటకు వస్తే అప్పుడు అవార్డు వెనక్కి తీసేసుకొనేవారా? అలా ఇప్పటి వరకూ ఎవరి అవార్డులైనా జాతీయ అవార్డు కమిటీ వెనక్కి లాక్కోగలిగిందా? ఇక మీదట జాతీయ అవార్డులకు నామినేషన్లు పంపేటప్పుడు క్లీన్ చిట్ పత్రాలు కూడా జత చేయాలా? ఆ అవసరాన్ని ఇప్పుడు జాతీయ అవార్డు కమిటీ కల్పించిందా? ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు.
ఓ సినిమా వాడ్ని ఎవరైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈజీగా టార్గెట్ చేయగలరు. కార్నర్ చేసేయగలరు. అందుకు జానీ ఉదంతమే నిదర్శనం. జాతీయ అవార్డు కోసం జానీ ఎంత కష్ట పడి ఉంటాడు..? సరే.. వచ్చింది. ఇప్పుడు ఓ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి అవార్డు పై స్టే ఇచ్చారు. నిర్దోషి అని తేలితే అప్పుడేం చేస్తారు? అప్పుడు మళ్లీ అవార్డు ఇస్తాం.. వచ్చేయ్ అంటే ఇప్పటి కళ, ఇప్పటి గౌరవం అప్పుడు ఉంటుందా? అవార్డు అందుకోవడానికి ఇంతే సంతోషంగా జానీ మాస్టర్ వెళ్లగలడా?
ఎన్నికల్లో గెలిచిన నాయకులకు ఈ ఆప్షన్ ఎందుకు లేదు? వాళ్లపై కేసులు నమోదైతే.. కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, నిజాయతీ నిరూపించుకొన్న తరవాతే పదవుల్లోకి రండి, ప్రజల్ని ఏలండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే సినిమా వాళ్లకు ఓ రూలు, రాజకీయాలకు మరో రూలా? ఇదెక్కడి న్యాయం?!