గ్లామర్ భామలు అప్పుడప్పుడూ నాయికా ప్రాధాన్యం ఉన్న కథలవైపు మొగ్గు చూపిస్తుంటారు. అయితే కెరీర్లో తమకంటూ ఓ స్టేజ్ వచ్చాక మాత్రమే ఈ ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తారు. అయితే సంయుక్త మీనన్ మాత్రం తన కెరీర్ ప్రారంభంలోనే అలాంటి రోల్ ఒకటి చేస్తోంది. సంయుక్త మీనన్ ప్రధాన పాత్రధారిగా హాస్య మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. రాజేష్ దండా నిర్మాత. ప్రస్తుతం రాజేష్ ‘మజాకా’ అనే ఓ సినిమా తీస్తున్నారు. సందీప్ కిషన్ హీరో. మరోవైపు ‘బచ్చలమల్లి’ ప్రొడక్షన్ లో ఉంది. ఈలోగా.. సంయుక్తతో ఓ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. యోగేష్ ఈ చిత్రానికి దర్శకుడు. రేపు లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీ ఓరియెంటెడ్ సినిమానే అయినా, బడ్జెట్ విషయంలో నిర్మాత వెనక్కితగ్గడం లేదు. ఈ సినిమాపై దాదాపు రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
సంయుక్త కూడా ఈ ప్రాజెక్ట్ లోకి అనూహ్యంగా వచ్చి చేరిపోయింది. రెండు రోజుల క్రితమే సంయుక్తకు కథ చెప్పారు. ఒక్క రోజులోనే తను ఓకే చేసేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాని పట్టాలెక్కించేస్తున్నారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలెడతారు. 2024 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సంయుక్త ప్రస్తుతం లారెన్స్ తో ఓ సినిమా ఒప్పుకొంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందించే చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఆ రెండు సినిమాల్లోనూ గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే దక్కించుకొంది.