పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో పాలన పరంగా కూడా అంతే కీలకంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పల్లెలపై తనదైన ముద్ర వేస్తున్నారు. 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించిన డిప్యూటీ సీఎం తాజాగా పల్లె పండుగకు శ్రీకారం చుట్టారు. గ్రామ సభల్లో 2024–25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఆ పనులను పల్లె పండుగ పేరుతో ప్రారంభించనున్నారు.
ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని అంతకు ముందు బ్లీచింగ్‌కు కూడా నిధుల ఉండేవి కాదన్నారు. వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చామని వాటిని తమ ప్రభుత్వం దారి మళ్లించదు కాబట్టి నిధుల సమస్యే ఉండదని పవన్ చెబుతున్నారు.
ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ర్టంలోని పంచాయతీల్లో ‘పల్లె పండుగ’ నిర్వహిస్తారు. ఆరో రోజు నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులను మొదలు పెట్టనున్నారు. గ్రామ సభలలో ఆమోదించిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులపై పవన్ అధికారులుక దిశానిర్దేశ చేశారు. పవన్ కల్యాణ్ గ్రామ సీమల్లో తన పనితీరుతోనే తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. సమర్థమైన అధికారుల టీంతో ఆయన చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.