ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో నారా లోకేష్ సమావేశమయ్యారు. సూపర్‌గా తమ సమావేశం జరిగిందని అతి పెద్ద ప్రకటన బుధవారం ఉంటుందని నారా లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఏపీలో భారీ పెట్టుబడుల ప్రకటనను టాటా గ్రూప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
టాటా గ్రూప్ ఏపీలో ఏ రంగంలో పెట్టుబడులు పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. హెచ్‌సీఎల్ క్యాంపస్ కూడా వచ్చినందున..టీసీఎస్ క్యాంపస్ ఏదైనా పెట్టేందుకు లోకేష్ అంగీకరింప చేశారా లేకపోతే.. కియా పరిశ్రమ వచ్చింది కాబట్టి మరో భారీ ఆటోమోబైల్ యూనిట్ ను ఏపీలో పెట్టేందుకు టాటాలను ఒప్పించారా అన్నది ఆసక్తికరంగా మారింది. టాటా గ్రూపు పెట్టుబడుల విషయంలో ఏపీ వైపు చూస్తే..అది పారిశ్రామీకరణ వైపు మరో ముందడుగు వేస్తుందని అనుకోవచ్చు.
నారా లోకేష్ మొదటి సారి మంత్రిగా చేసినప్పుడు పరిశ్రమలను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్లస్టర్ లో ఉన్న అత్యధిక పరిశ్రమలు నారా లోకేష్ చొరవతో వచ్చినవే. అదాని డేటా సెంటర్ కూడా లోకేష్ చొరవతోనే వచ్చింది.కానీ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆ సంస్థకు భూముల్ని అటూ ఇటూ మార్చి కేటాయించడం తప్ప.. పనులు ప్రారంభించేలా చేయలేకపోయారు. కానీ అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే నారా లోకేష్ మరోసారి ప్రముఖ కంపెనీలను ఏపీ వైపు చూసేలా చేస్తున్నారు.