రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకోవడం అనే అలవాటు అలవరుచుకోవాలి. సొంత పార్టీ నేతలకు కష్టం వస్తే కచ్చితంగా అండగా నిలబడాలి. కాని తెలంగాణాలో సీన్ రివర్స్ అవుతోంది. మంత్రి కొండా సురేఖ ఒంటరిగా కనపడుతున్నారు. సాధారణంగా తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో దూకుడు తక్కువ. అందుకే వేరే పార్టీలో ఉన్న మాస్ లీడర్ రేవంత్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిచింది కాంగ్రెస్ అధిష్టానం. సీనియర్లకు కోపం వచ్చినా రేవంత్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. 2018 లో మిస్ అయినా 2023 లో గురిపెట్టి కొట్టారు.
కాంగ్రెస్ ను విజయలక్ష్మి వరించడంలో రేవంత్ పాత్రే మేజర్. ఇప్పుడు రేవంత్ సీఎంగా ఎవరూ ఊహించని దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో పార్టీని ఇలాగే భుజాన మోసేవారు. ఆ తర్వాత పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ దూకుడుగా ఉండేవారు. ఇక కర్ణాటకలో డీకే శివకుమార్ ది కూడా దాదాపు ఇదే నైజం. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కూడా దూకుడు స్వభావం ఉన్న నేతే. ఇక చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ రేవంత్ రూపంలో ఆ పార్టీకి మాస్ లీడర్ దొరికారు. ఎవరేమన్నా రేవంత్ చూసుకుంటారు అనే ధీమానో ఏమో గాని చాలా మంది మంత్రులు కూడా సైలెంట్ గా ఉంటున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకో సైలెంట్ అయ్యారు. ఉత్తమ కుమార్ రెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. అన్ని పార్టీలతో ఆయనకు స్నేహ సంబంధాలు ఉంటాయి. ఇక పొంగులేటి మాస్ లీడర్ అయినా… మాటల్లో దూకుడు తక్కువ. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలకు ప్రజల్లో ఆదరణ ఉన్నా మాస్ లీడర్లు కాదు. సీతక్క అప్పుడప్పుడు ఘాటుగా మాట్లాడినా ఆమె ఓ పద్ధతి ఫాలో అవుతారు. బీఆర్ఎస్ నేతలకు గట్టిగానే సమాధానం ఇస్తూ ఉంటారు. కాని రేవంత్ టీం రాసిచ్చిన ప్రసంగాలు చదువుతారు అనే విమర్శ ఆమెపై అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల మాత్రమే ఇప్పుడు రేవంత్ కేబినేట్ లో దూకుడుగా ఉన్నారు. ఇక కొండా సురేఖ… కోపంలో విసిరిన మాటల బాణాలు తిరిగి ఆమెకే తగిలేలా కనపడుతున్నాయి. ఎటు తిరిగి ఈ భారం మొత్తం రేవంత్ మోయ్యాల్సిన పరిస్థితి ఉంది. రైతు రుణమాఫీ జరగలేదు అంటే మాట్లాడరు… హైడ్రా ఎందుకో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయరు, మూసీ విస్తరణ, శుద్ధి ఎందుకో మాట్లాడరు. అసలు మూసి మురికితో ఇబ్బంది పడేది నల్గొండ ప్రజలే. అక్కడి ఎమ్మెల్యేలు కూడా ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు.
ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కూడా మౌనమే ఎంచుకున్నారు. వాస్తవానికి కేటిఆర్ మాటల్లో దూకుడు, సోషల్ మీడియాలో పోస్ట్ లు దారుణంగా ఉన్నాయి. ఈ విషయంలో సురేఖకు బీజేపి నుంచి మద్దతు వచ్చింది. రఘునందన్ రావు కోర్ట్ కు కూడా వెళ్తా అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎలాగూ మాట్లాడలేరు. కనీసం మంత్రులైనా ఆమెకు మద్దతు ఇవ్వడమో… మీరు అన్నారు కాబట్టే ఆమె అన్నారు అనడమో… క్షమాపణ చెప్పారు కదా అని సమర్ధించడమో… ఆమె పరువును బీఆర్ఎస్ సోషల్ మీడియా తీసింది కాబట్టి కేటిఆర్ పై పరువు నష్టం వేస్తామనో ఏ ఒక్కటి మాట్లాడటం లేదు. సీతక్క మినహా ఇతర మంత్రులు ఎవరూ కొండా సురేఖకు మద్దతు ఇవ్వలేదు. మరి ఈ మౌనం ఎన్నాళ్ళో ఆ నేతలే ఆలోచించుకోవాలని కాంగ్రెస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొనసాగితే 2019లో టీడీపీ 2028లో కాంగ్రెస్.