కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థకి ఈడి అధికారులు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ రాజస్థాన్ లోని బికనీర్ లో భూమి కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకి పాల్పడిందని ఆరోపిస్తూ మనీ లాండరింగ్ చట్టం కింద ఈడి నోటీసు జారీ చేసింది. ఆ వార్త నిన్న దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిపై రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంకా వాద్రా చాలా తీవ్రంగా స్పందించారు.
“మాకు ఈడి నోటీసులు పంపితే ఆ విషయం ముందుగా మాకు తెలియాలి కానీ మీడియాకి ఒకరోజు ముందే తెలిసింది. ఆ వార్త మీడియాలో వచ్చిన తరువాతే మాకు ఈడి నుంచి నోటీసు అందింది. దీనిని బట్టి అర్ధం అవుతున్నదేమిటంటే ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే మాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఇటువంటి విషయాలని ముందుగానే మీడియాకి లీక్ చేస్తోంది. ఇటువంటి బెదిరింపులకి మేము భయపడిపోము. ధైర్యంగా ప్రభుత్వంతో పోరాడుతాము,” అని చెప్పారు.
అవినీతి, అక్రమాల కేసులో ఈడి నుంచి నోటీసు అందుకొన్నందుకు ఆమె భయపడటం లేదు..బాధ పడటం లేదు. సిగ్గు పడటం లేదు. కానీ ఆవిషయం తమకంటే ముందే మీడియాకి తెలిసినందుకే ప్రియాంకా వాద్రా బాధపడుతుండటం విశేషం. ఇదేలాగుంది అంటే అత్తా కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకే ఏడుస్తున్నానన్నట్లుంది.
గత యూపియే హయంలో ఎంత అవినీతి, అక్రమాలకి పాల్పడినా సోనియా గాంధీ కుటుంబ సభ్యులు ఎవరిపైనైనా ఈగ వాలినా దానిని మోడీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగానే చెప్పుకొని ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుంటారు. 2జి, 3జి స్పెక్ట్రం అక్రమ కేటాయింపులు , బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు, నేషనల్ హెరాల్ద్ కేసు వగైరా అన్నీ కూడా తమ కుటుంబం పై కక్ష సాధింపు చర్యలుగానే అభివర్ణిస్తుంటారు. ఆ పద్ధతి ప్రకారమే దీనిని కూడా కక్ష సాధింపు చర్యలుగానే అభివర్ణిస్తున్నట్లున్నారు.