ఏపీ ప్రజల్ని ఎంత టార్చర్ పెడితే అంత ఘోరమైన తీర్పు ఇచ్చారో కానీ రూల్స్ ప్రకారం వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. కానీ వైసీపీ ప్రతిపక్షమే. జగన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే “నలభై శాతం ఓట్లు వచ్చిన మా పార్టీ ప్రతిపక్షం కాక మరేమిటి?.” అంత క్లారిటీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలా ప్రవర్తిస్తున్నారా ? . సరైన విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకుంటే… ప్రజల్లో సానుభూతి కూడా వస్తుంది.కానీ ఫేక్ న్యూసులు ప్రచారం చేసి తాము మాత్రం బయటకు రాబోమంటే ఎలా ఉంటుంది ?
గెలిచినప్పుడు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వర్క్ ఫ్రం హోం చేశారు. ఓడిపోయిన తరవాత కూడా బెంగళూరు ప్యాలెస్ నుంచి వర్క్ ఫ్రం హోం చేసి పార్టీని నడుపుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం అంటే… రోజా, శ్యామల వంటి వాళ్లతో వీడియోలు రిలీజ్ చేయించడం అనుకుంటున్నారు. షాట్ గ్యాప్ లో వారు ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేసి వీడియో రిలీజ్ చేస్తారు. దాన్నే ప్రభుత్వంపై విమర్శలు అనుకోవాలి. వారికి తోడు అంబటి రాంబాబు, పేర్ని నాని. ప్రతిపక్ష రాజకీయాలంటే రాజకీయ విమర్శలు మాత్రమే కాదు. ప్రజలకు భరోసా ఇవ్వగలగాలి.
విజయవాడ వరదల సమయంలో వైసీపీ నేతలు ఎవరూ కనిపించలేదు. మేయర్ ను నాకే ప్రోటోకాల్ దర్శనం లేదా అని బెజవాడ మేయర్ కొండపై రాజకీయం చేశారు కానీ వరదల సమయంలో ఆ ప్రథమ పౌరురాలు ప్రజల కోసం ప్రోటోకాల్ ను ఉపయోగించలేదు. ఇక ఇతర విజయవాడ నేతలు ఎవరూపట్టించుకోలేదు. జగన్ రెడ్డి మీడియా షూటింగ్ కోసం రెండు సార్లు వచ్చి రెండు గంటలు పాటు షో చేసి పోయారు. ఇలా చేస్తే ప్రజల్లో ప్రతిపక్షం అనే ముద్ర పడుతుంది . అదే సమయంలో శవ రాజకీయాల కోసం ఆరాటపడుతున్నారు. నేరం జరిగితే చాలు రాజకీయం చేసే ప్రయత్నం చేయడం ప్రజల్ని మరింతగా అసహ్యించుకునేలా చేస్తోంది.
ప్రతిపక్ష పాత్రను పోషించే విషయంలో వైసీపీ ముందుగా ఓ క్లారిటీ కి రావాల్సి ఉంది. శ్యామల, రోజా, పేర్ని, అంబటి వంటి వారు మాట్లాడే మాటలే ప్రజలకు భరోసా ఇస్తాయన్న భ్రమ నుంచి బయటకు రావాల్సి ఉంది. లేకపోతే ముందు ముందు టీడీపీ నుంచి జరిగే దాడిని తట్టుకోవడం కష్టంగా మారుతుంది.