గెలిచినప్పుడు చంకలు గుద్దేసుకుని ఓడిపోయినప్పుడు ఈవీఎంను నిందించడం ఓల్డ్ ఫ్యాషన్ . గెలిచినప్పుడు కూడా నా స్టాండ్ అదే అని గట్టిగా చెబితే దానికో వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు ఓడిపోయిన దగ్గర మాత్రమే ఈవీఎంలు తేడా కొట్టాయి అని గగ్గోలు పెడితే ప్రజలు కూడా వింతగా చూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం .. దానికి డోలు వాయిస్తున్న జగన్ నిర్వాకాలు అలాగే ఉన్నాయి.
ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. మరి తాము గెలిచినప్పుడు నమ్మకం పెరుగుతుందా ?. కర్ణాటక , తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు జమ్మూ కశ్మీర్లోనూ కాంగ్రెస్ లేదా ఆ పార్టీ కూటమి గెలిచింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదు. దున్నేస్తుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పిన యూపీలో కూడా బీజేపీ వెనుకబడిపోయింది. మరి అప్పుడు కూడా ఈవీఎంలను ఎందుకు నిందించలేదు ?.
ఈవీఎంలకు వ్యతిరేకంగా గతంలోనే చాలా పార్టీలో పోరాడాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఈవీఎంలను మార్చాల్సిందేనంటున్నారు. అంటే ఆయనను ఆయన ఎగతాళి చేసుకుంటున్నారు. ట్రోల్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా అంతే. ఈవీఎంలను ఒకప్పుడు బీజేపీ కూడా వ్యతిరేకించింది. చంద్రబాబు కూడా వ్యతిరేకించారు. అందరూ వ్యతిరేకమే.కానీ ఓడిపోయినప్పుడే అలా నిందిస్తున్నారు. అలా చేయడం వల్లనే ప్రజలకు చులకన అవుతుంది.
అందుకే ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలపై నిందలు వేసే రాజకీయం చేయడం కన్నా… భవిష్యత్ పై దృష్టి పెట్టి ప్రజల కోసం పని చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉండవచ్చు.