అన్నమయ్యజిల్లాలోని మైసూరు వారి పల్లె స్కూల్కు అవసరమైన ఆట స్థలాన్ని పవన్ కల్యాణ్ తన సొంత డబ్బు అరవై లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ స్థలాన్ని పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ఇంక ఆ స్థలం పంచాయతీదే. ఇంతకు ముందు నాలుగు కోట్లరూపాయలు పంచాయతీలకు ఇచ్చారు. వరద బాధితులకు మరో రెండు కోట్లు ఇచ్చారు. ఈ సాయాల గురించి పక్కన పెడితే ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా సొంత డబ్బులతో చేయడం అనే కాన్సెప్ట్ మాత్రం మంచిదేనా అన్న చర్చ జరుగుతోంది.
మైసూర్ వారి పల్లెలో తొలి సారి జనసేన గెలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు జనసేనను ఆదరించారు. రైల్వేకోడూరులోనూ జనసేన గెలిచింది. ఆ కృతజ్ఞతతో పవన్ అక్కడ నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ఆటస్థలం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అది ప్రభుత్వ పరంగా చేయగలిగిన పని . చేయాల్సిన పని కూడా. వ్యక్తిగతంగా డబ్బులు వెచ్చించి ఆ పని పూర్తి చేయడం వల్ల భవిష్యత్ లో ఆయన నుంచి చాలా మంది అదే ఆశిస్తారు.
ప్రభుత్వ స్కూళ్లకు బిల్డింగులు, స్థలాలు ఇచ్చే స్కీమ్ ఉంది. తమ పూర్వీకుల పేరు మీద స్కూల్ ఏర్పాటు చేసుకోవడానికి ఆ విరాళాలు ఇస్తారు. చాలా ప్రభుత్వ స్కూళ్లకు ఇతరుల పేర్లు ఉండటానికి ఇదే కారణం. ఇటీవల కేటీఆర్ తమ అమ్మమ్మ, తాతయ్యల పేర్ల మీద స్కూల్ బిల్డింగులు కట్టించారు. ఇలా చేస్తే పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా మాట ఇచ్చి. .. సొంతడబ్బుతో హామీ నెరవేర్చారు. ప్రభుత్వానికి ..ప్రజలకు సొంత డబ్బుతో సేవ చేయాలంటే.. ఎన్ని వేల కోట్లు ఉన్నా సరిపోదు.
పవన్ కల్యాణ్ ఇలా ప్రతీ దానికి సొంత డబ్బును వితరణ చేయడం వల్ల ఆయనపై రాను రాను ఇతరులు అంచనాలు పెంచుకుంటారు. ఇవ్వకపోతే నొచ్చుకుంటారు. జన్మభూమికి సేవచేయాలనుకునేవాళ్లు.. పిల్లల చదువులకు సాయం చేయాలనునేవారు చాలా మంది ఉంటారు. వారందర్నీ ఓ వేదిక మీదకు తెచ్చి తాను కొంత సాయం చేస్తే బెటర్ కానీ ఇలా సొంత డబ్బును వెచ్చించడం దీర్ఘకాలంలో ఆయనకే నష్టం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది.