హర్యానాలో చేతికి వచ్చిన విజయాన్ని నేలపాలు చేసుకున్న కాంగ్రెస్ వైఖరి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఈవీఎంలపై నిందలు వేస్తూ పోతోంది. కాంగ్రెస్ తీరుపై ఇండీ కూటమిలోని పార్టీలు కూడా సెటైర్లు వేస్తున్నాయి. ఈవీఎంలను తీరిగ్గా నిందించవచ్చు కానీ ముందుగా తప్పులు దిద్దుకోవాలని సలహాలిస్తున్నారు. అహంకారం తగ్గించుకోవాలని.. మంచి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంటున్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ వాదనకు ఎవరూ సపోర్టుగా ముందుకు రావడం లేదు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఇక కాంగ్రెస్ తో పని లేదని తేల్చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. దీనికి కారణం హర్యానాలో ఆమ్ ఆద్మీని కలుపుకోకపోవడమే. గెలిచేస్తామని మరో పార్టీ మద్దతు అవసరం లేదనుకున్న కాంగ్రెస్ ఆమ్ ఆద్మీని చివరి వరకు వెయిట్ చేసేలా చేసి హ్యాండిచ్చింది. ఇప్పుడు ఆప్ అలా చేయలేదు… ముందుగానే తాము రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరి పోటీ అని తేల్చేసింది. ఇండీ కూటమిలో భాగంగా ఉంటుందా లేదా అన్నది సందర్భాన్ని బట్టి తేల్చుకోవచ్చు. శివసేనతో పాటు మరికొన్నిపార్టీలు కూడా కాంగ్రెస్ పై సెటైర్లు వేస్తున్నాయి.
అయితే ఈ విషయలో కాంగ్రెస్కు జగన్ మాత్రమే సపోర్టుగా ఉంటున్నారు. కాంగ్రెస్ కూటమిలో లేనప్పటికీ ఈవీఎంలపై కాంగ్రెస్ తో కలిసి అనుమానాలు వ్యక్తం చేసేందుకు రెడీగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఇతర బలమైన మిత్రుల్ని కోల్పోయి.. జగన్ లాంటి వారి ఆలోచన స్థాయికి దిగజారిపోతోంది. తాము ఎదుగుతున్నారో…. పతనమవుతున్నారో కాంగ్రెస్ నేతలు ఎప్పుడు విశ్లేషించుకుంటారో మరి !