ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారం…తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటే చాలన్న ఓ సింగల్ సూత్రాన్ని వైసీపీ పాటించింది. ఫలితం ఎలా ఉందో అందరికీ తెలిసిందే కానీ.. ఇలా కోట్లకు కోట్లు పార్టీ తరపునే వైట్ మనీతో ఖర్చు పెట్టారు అంటే..ఇక బ్లాక్ మనీ ఎంత ఖర్చుపెట్టి ఉండాలి.. ప్రజాధనంతో ఇచ్చిన ప్రకటనలు, ప్రచార ఖర్చు ఎంత ఉండాలి అని ఆలోచిస్తే.. ఆ పార్టీతో అసోసియేట్ అయిన వారు ఎంత భారీగా దండుకున్నారె చెప్పాల్సిన పని లేదు.
60 రోజుల్లో 87 కోట్లకుపైగా ప్రకటనల ఖర్చు – ప్యూర్ వైట్ మనీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటిచింన మార్చి 16 నుంచి ఫలితాలు వచ్చిన జూన్ 6వ తేదీ వరకూ చేసిన ఖర్చులను వైసీపీ ఈసీకి సమర్పించింది. అందులో తాము మీడియా సంస్థల కోసం రూ. 87 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది. షెడ్యూల్ వచ్చినప్పటి నుండి ఏపీలో పోలింగ్ జరిగే వరకూ రెండునెలలు గడువు. పోలింగ్ తర్వాత ఎలాంటి ప్రకటనలు లేవు. ఈ అరవై రోజుల్లో ఎనభై ఏడు కోట్ల రూపాయలకుపైగా మీడియా సంస్థలకు చెల్లించారు. ఇందులో టీవీ9, టెన్ టీవీ, ఎన్టీవీలకు అత్యధిక భాగం ఇచ్చారు. అలాగే సినిమా ధియేటర్లలో యాడ్స్ కోసం క్యూబ్, యూఎఫ్వో వంటి సంస్థలకు కూడా కోట్లలో చెల్లింపులు చేశారు. ఇక ఐడ్రీమ్ , సాక్షి కి కూడా చెల్లింపులు చేశారు. ఇదంతా అధికారికం.
వందల కోట్లలో బ్లాక్ మనీ ప్రచారం వేరే ఖాతా !
పైన చెప్పుకుంది ఎన్నికల షెడ్యూల్ వచ్చాక… పోలింగ్ ముగిసే వరకూ చేసిన అధికారిక ఖర్చు. కానీ షెడ్యూల్ రావడానికి ముందే ఏడాది నుంచి వైసీపీ బ్లాక్ మనీని విచ్చలవిడిగా పంచుతూ యూట్యూబ్ చానళ్లు, జర్నలిస్టులను పెంచి పోషించింది. ఈహా టీవీ అని పెట్టుకున్న మాజీ ఏబీఎన్ జర్నలిస్టు ఒకరికి … ఏడాది కనీసం రూ. కోటి ముట్టి ఉంటాయి. ఇక ఆయన చానల్లో ప్యానలిస్టులు ఉంటారు .. ఆ ప్రసాద్..ఈప్రసాద్ అని.. వారందరికీ లక్షల్లో.ఇది ఒక చిన్నఈక మాత్రమే. ఓ మహిళాయంకర్ నడిపే చానల్ దగ్గర నుంచి మీమ్స్ పేజీల వరకూ ప్రతి ఒక్కరికి ఏడాది పాటు ప్రతి నెలా లక్షల్లో నగదు చెల్లించేవారు. వైసీపీ నుంచి ఇలా నగదు అందుకున్న వారు వందల్లోనే ఉంటారు. ఇసుక, మద్యం వ్యవహారాలు మొత్తం నగదుతో నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బులో ఓ భాగం ఇలా పెయిడ్ జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఇది మూడు నుంచి ఐదు వందల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
ఇక ప్రభుత్వ ఖాతాలో పడిన ఖర్చు ఎంతో ?
ప్రభుత్వం పేరుతో పరోక్షంగా వైసీపీకి చేసుకున్నప్రచారానికి లెక్కే లేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఐదేళ్లపాటు వైసీపీ చేసుకుంది ప్రచారమే. చివరి ఏడాదిలో పథకాలకు బటన్లు నొక్కినట్లుగా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు.ఎప్పుడు చూసినా ఫుల్ పేజీ ప్రకటనలు కనిపించేవి. ఒక్క సాక్షికే ఆరువందల కోట్ల ప్రజాధనం కట్టబెట్టారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇలా చూస్తే ఎన్నికల సమయంలో కనీసం ప్రభుత్వం ఖాతాలో ఎంత లేదన్న ఓ వంద కోట్లు కలిపేసి ఉంటారని అనుకోవచ్చు.
వైసీపీ చేసుకున్నప్రచారం.. వచ్చిన ఫలితాలను బేరీజు వస్తే… అతడు సినిమాలో కోట శ్రీనివాసరావు తన అనుచరుడుకు ఫోన్లో సర్కాస్టిక్గా చెప్పినట్లుగా… జగన్ .. సజ్జలతో చెప్పి ఉంటారు.. ” ఏం పర్లేదమ్మా… బ్యాగ్ తీసుకొచ్చేయ్.. కుట్టేసుకుని మళ్లీ వచ్చే ఎన్నికలకు వాడుకుందాం” అని.