మూసీ ప్రాజెక్టు కోసం అవసరమైతే రేస్ కోర్స్ ను తరలిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో ప్రకటించారు. ఆ మాటలను యథాలాపంగా అన్నారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి నిజంగానే రేస్ కోర్సును తరలించి ఆ స్థలాన్ని డెవలప్మెంట్కు ఇచ్చి ఆ నిధులతో మూసీని పూర్తి చేయాలనుకుంటున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున 150 ఎకరాలపై స్థలంలో రేస్ కోర్స్ క్లబ్ ఉంది. ఆ భూమిని ప్రభుత్వం తీసుకుని దానికి బదులుగా రేస్ క్లబ్‌కి ఫోర్త్ సిటీలో ఒకటిన్నర రెట్ల భూమిని ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దీనిపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే తుది నిర్ణయానికి వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే రేస్ కోర్స్‌తో పాటు ప్రభత్వానికీ లాభమే అనుకోవచ్చు.
రేస్ కోర్స్ ను ఎప్పుడో మలక్ పేట నగరశివారుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చేసింది. ఇప్పుడు ఫోర్త్ సిటీలో మూడు, నాలుగు వందల ఎకరాలు కేటాయిస్తే అత్యాధునిక రేస్ కోర్స్ తో పాటు క్లబ్ నిర్మించుకోగలరు. అదే సమయంలో రేస్ కోర్స్ స్థలం ప్రభుత్వానికి వస్తే మూసీ ప్రాజెక్టును ఓ దారికి తెచ్చుకుంటారు. అంటే ఉభయులక ప్రయోజనమే అవుతుందన్న వాదన వినిపిస్తోంది.