Viswam Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్-
శ్రీనువైట్లకంటూ ఓ బ్రాండ్ ఉంది. ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శీను, ఢీ, రెడీ, దూకుడు.. ఇవన్నీ శ్రీనువైట్ల మార్క్ సినిమాలు. ఈ సినిమాల స్పెషాలిటీ ఏమిటంటే… ఎక్కడ నుంచి చూసినా, రీమోట్ అవసరం ఉండదు. ప్రతీ సీనూ ఎంజాయ్ చేయొచ్చు. అందులో కామెడీ బిట్లయితే ఎన్నిసార్లు చూసినా, నవ్వుతూనే ఉంటాం. వినోదాన్ని కమర్షియల్ మీటర్ లో పెట్టి, ఆ ఫార్ములాలోకి పెద్ద హీరోల్ని లాక్కొచ్చి సూపర్ హిట్లు కొట్టాడు. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల ఫామ్ లో లేడు. మారిన ప్రేక్షకుల పల్స్ ని పట్టుకోవడంలో విఫలం అవుతూ వరుసగా ఫ్లాపులు కొడుతున్నాడు. తనని తాను నిరూపించుకోవాల్సిన తరుణంలో శ్రీనువైట్ల నుంచి వచ్చిన సినిమా ‘విశ్వం’. ఈ సినిమా రిజల్ట్ గోపిచంద్ కు కూడా అవసరమే. ఎందుకంటే తనకూ ఇప్పుడు ఓ బ్రేక్ కావాలి. అటు హీరోకీ, ఇటు దర్శకుడికీ ఓ హిట్టు అత్యవసరం అనుకొన్న దశలో వచ్చిన ‘విశ్వం’ ఎలా వుంది? గోపీచంద్, శ్రీనువైట్లకు బ్రేక్ ఇచ్చిందా?
పాకిస్థాన్ నుంచి వచ్చిన తీవ్రవాది (జిషుసేన్ గుప్తా). ఇండియాని నాశనం చేయాలనుకొంటాడు. ఆ క్రమంలో ఓ మర్డర్ చేస్తాడు. అదో పాప చూస్తుంది. ఆ పాప నోరు తెరిస్తే తన ఉనికి తెలిసిపోతుందన్న భయంతో… పాపని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాల్ని గోపి (గోపీచంద్) అడ్డుకొంటుంటాడు. అసలు గోపి ఎవరు? అతని కథేమిటి? ఆ పాపని రక్షించాడా లేదా? అనేది మిగిలిన కథ.
కథేమిటో క్లుప్తంగా చెప్పుకొన్నాక, అసలు ఏముంది ఈ కథలో? ఇంత సింపుల్ పాయింట్ తో అటు గోపీచంద్ ని, ఇటు నిర్మాత విశ్వ ప్రసాద్ ని ఎలా ఒప్పించాడా? అనే అనుమానం వేస్తుంది. నిజానికి శ్రీనువైట్ల గత హిట్ చిత్రాల్లోనూ పెద్దగా కథేమి ఉండదు. కానీ తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో సినిమాల్ని లాక్కొచ్చేశాడు. అయితే ఫామ్ లో లేనప్పుడు, బలాలు కూడా బలహీనతలు అయిపోతాయేమో? శ్రీనువైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్. హీరో, నిర్మాత కూడా నమ్మింది అదే. కానీ ఈ సినిమాలో అదే మిస్సయ్యింది. టెర్రరిజం, వాళ్లు ఈ దేశానికి ద్రోహం తలపెట్టడం లాంటి సీరియస్ పాయింట్ తో కథ మొదలవుతుంది. ఆ తరవాత హీరో ఎంట్రీ ఇవ్వడం… పాపకు అండగా నిలవడం అనే రొటీన్ ఫార్ములాలోకి కథ వెళ్లిపోతుంది. అక్కడ్నుంచి వచ్చిన ప్రతీ సీన్… పాత శ్రీనువైట్ల సినిమాల్ని గుర్తుకు చేస్తాయి. దానికి అనుకరనో, నకలో అయి ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే… అందులోంచి కామెడీ మాత్రం పండదు.
పాత శ్రీనువైట్ల సినిమాలు గుర్తున్నాయి కదా. ఢీ, రెడీ, దూకుడు, బాద్ షా.. ఇలాంటివన్నమాట. అందులో హీరో తన పక్క క్యారెక్టర్లకు ఏదో ఓ కథ చెప్పి, బకరాల్ని చేసి, తన మిషన్ కు వాడుకొంటుంటాడు. సేమ్ అదే ఫార్ములా ఇక్కడా రిపీట్ చేశాడు శ్రీనువైట్ల. దాంతో.. తెరపై జబర్దస్త్ లో పేరడీ స్కిట్లు చూసిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప.. ఒర్జినాలిటీ ఉండదు. శ్రీనువైట్ల పాత సినిమాల్లో కామెడీ అనేది.. ఆర్గానిక్ గా ఉంటుంది. ఇక్కడ అది లోపించింది. ఆఖరికి చిత్రబృందం గొప్పగా చెప్పుకొన్న ట్రైన్ ఎపిసోడ్ లో కూడా ల్యాగు తప్ప లాఫులు లేవు. ఆ ఎపిసోడ్ లో కనిపించిన ప్రతీ పాత్ర కావాలని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు ఎక్కువే రాసుకొన్నా.. అందులోంచి ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం పిండలేకపోయాడు శ్రీనువైట్ల. హీరో – హీరోయిన్ల ట్రాక్ కూడా… కేవలం టైమ్ పాస్ వ్యవహారంలా ఉంటుంది. గోపీచంద్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సైతం పాత సినిమాల కలగూర గంపే! అందులోనూ ఎమోషన్ లేదు.
సినిమా మొత్తం చూశాక.. శ్రీనువైట్ల మరోసారి కథపై పెద్దగా దృష్టి పెట్టలేదనిపించింది. ఈరోజుల్లో రెగ్యులర్ ఫార్మెట్ సినిమాల్ని ఎవరూ చూడడం లేదు. ఒకవేళ అలాంటి కథలు చెప్పాలనుకొంటే.. ఎంటర్టైన్మెంట్ బలంగా రాసుకొని, తిమ్మిని బమ్మి చేయగలగాలి. ఆ విషయంలోనూ శ్రీనువైట్ల ఫెయిల్ అయ్యాడు. తన పాత సినిమాల్ని కాపీ కొట్టి, వాటిలోని సన్నివేశాల్ని, క్యారెక్టరైజేషన్లనీ కలిపి కుట్టేశాడు. అయితే అవన్నీ ఈ జమానాకు అవుడ్డేటెడ్ అయిపోయాయన్న విషయాన్ని మాత్రం శ్రీనువైట్ల మర్చిపోయాడు.
గోపీచంద్ శ్రీనువైట్లని నమ్మి, ఆయన ఏం చెబితే అది చేసుకొంటూ వెళ్లిపోయాడనిపించింది. గోపీచంద్ కు కామెడీ చేయడం కొత్త కాదు. ఫైట్లు చేయడం అసలే కాదు. ఇవి రెండూ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే.. వాటిలో కొత్తదనం ఒక్కటే మిస్ అయ్యింది. కావ్య థాపర్ కేవలం గ్లామర్ డాల్ గా కనిపించింది. ఆ పాత్రకు కూడా ఓ క్యారెక్టరైజేషన్ పెట్టి కామెడీ పిండాలని చూశారు. అదెందుకో ఆర్గానిక్ గా లేదు. అందుకే ఇటలీ ఎపిసోడ్ లో కామెడీ పండలేదు. వెన్నెల కిషోర్ కూడా ఎంత గింజుకొన్నా.. నవ్వించలేకపోయాడు. దానికి కారణం రైటింగ్ లో బలం లేకపోవడమే. నరేష్, ప్రగతి.. తమకు తోచినంత ఓవర్ యాక్షన్ చేశారు. ఫృథ్వీ ఉన్నంతలో కాస్త డీసెంట్. నిజానికి ఈ పాత్రని బ్రహ్మానందం తో చేయిద్దామనుకొన్నాడు శ్రీనువైట్ల. బ్రహ్మీ చేస్తే ఆ పాత్ర ఇంకాస్త పండేది.
నిర్మాత తన శక్తికి మించి ఖర్చు పెట్టారు. అది ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. లెక్కకు మించిన లొకేషన్లు ఉన్నాయి. విజువల్ గా సినిమా రిచ్ గా ఉంది. గుహన్ కెమెరా పనితనం డీసెంట్ గా ఉంది. పాటలు రిజిస్టర్ అవ్వవు. నేపథ్య సంగీతంలోనూ పెద్దగా మెరుపులేం ఉండవు. ‘నెక్ట్స్ లెవల్.. నెక్ట్స్ లెవల్’ అంటూ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఆరాటపడుతుంటుంది. శ్రీనువైట్ల గాడిలో పడాలంటే ‘నెక్ట్స్ లెవల్’ ఆలోచనలు కావాలి. కానీ ఆయనేమో… అవుడ్డేటెడ్ ఐడియాతో వచ్చారు. ఈసారీ నిరాశ పరిచారు.
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్-