తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మరో సరికొత్త వివాదానికి తెర లేపారు. డిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ ఒకప్పటి నిజాం నవాబు కి చెందిన భూముల్లోనే నిర్మించబడింది కనుక అది తెలంగాణాకే చెందుతుందని, కనుక దానిని తమకి అప్పగించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కి ఒక లేఖ వ్రాశారు. ఆ భవనాన్ని తమకి అప్పగించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరే చోట భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రా భవన్ న్ని తమకి అప్పగిస్తే దానిని కూల్చి వేసి తమ అవసరాలకు తగ్గట్లుగా కొత్త భవనం నిర్మించుకొంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త భవనం నిర్మించుకోవడానికి అవసరమైతే సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.
దాని గురించి రెండు రాష్ట్రాల మద్య వివాదం తలెత్తే అవకాశం ఉందని గ్రహించిన యూపియే ప్రభుత్వం, విభజన చట్టంలోనే అది రెండు రాష్ట్రాలకి విభజించి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం దాని గురించి ఒత్తిడి చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. రెండేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు దాని కోసం కేంద్రానికి లేఖ వ్రాయడం విచిత్రంగానే ఉంది. ఆయన వాదనకి బలం చేకూర్చుకోవడానికి నిజాం నవాబు పేరు ప్రస్తావించినప్పటికీ, విభజన చట్టానికే విలువ ఉంటుందని బహుశః కెసిఆర్ కి తెలిసే ఉంటుంది. అది తెలిసి కూడా లేఖ వ్రాశారంటే మరో యుద్ధానికి సిద్దపడుతున్నట్లే భావించవలసి ఉంటుంది.