ఇద్దరూ స్పిన్నర్లే. బంతిని బాగా తిప్పిన వాళ్లే. మరి టీమిండియాను మేలిమలుపు తిప్పేదెవరు. ఈ విషయాన్ని ఇద్దరు బ్యాట్స్ మెన్ తేల్చారు. ఫిఫ్టీ ప్లస్ రవిశాస్త్రి కంటే ఫార్టీ ప్లస్ కుంబ్లే మేలని సచిన్ టెండుల్కర్, సౌరభ గంగూలీ తుదిమాట చెప్పేశారు. అంతే, భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ గా అనిల్ కుంబ్లే నియమితుడయ్యాడు. ఇందుకోసం ఇంటర్ వ్యూ జరిపిన బీసీసీఐ సలహా కమిటీలో సచిన్, సౌరభ్ లు కీలక పాత్ర పోషించారు. వీళ్లిద్దరూ ఒకప్పుడు మేటి బ్యాట్స్ మెన్ గా పేరు పొందిన వాళ్లే.
చీఫ్ కోచ్ పదవికి చాలా మంది పోటీ పడ్డారు. చివరికి రవిశాస్త్రి, కుంబ్లేల మధ్య పోటీ ఏర్పడింది. రవిశాస్త్రిని లంబూ అని, అనిల్ కుంబ్లేని జంబో అని క్లోజ్ ఫ్రెండ్స్ పిలుస్తుంటారు. మొత్తానికి 54 ఏళ్ల రవిశాస్త్రి క్రికెట్ చాణక్యంలో ఆరితేరినవాడని పేరుంది. కాబట్టి తన ప్రతిభను ఉపయోగించి చాన్స్ కొట్టేస్తాడని చాలా మంది భావించారు. కానీ 45 ఏళ్ల కుంబ్లే జెంటిట్ మన్ గా పేరు పొందడం ప్లస్ పాయింట్ అయింది. 41 ఏళ్ల అనురాగ్ ఠాకూర్ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంటర్ వ్యూలు జరిపిన కీలక సలహాదారులు సచిన్, సౌరభ్ లు కూడా రవిశాస్త్రి కంటే చాలా చిన్నవాళ్లు. ఒక రకంగా భారతీయ క్రికెట్ బోర్డులో యువ రక్తం కనిపిస్తోంది . కొత్త గాలి వీస్తోంది.
భారతీయ క్రికెట్ బొంబాయి కనుసన్నల్లో నడుస్తుందనేది పాత మాట. ముంబై ఆధిపత్యానికి తెరపడి చాలా కాలమైంది. ఒకప్పుడు గవాస్కర్, ఆ తర్వాత టెండుల్కర్ టీమిండియాకు వెన్నెముకగా నిలిచారు. ఇప్పుడు వన్డే జట్టు కెప్టెన్ ధోనీ గానీ, టెస్ట్ కెప్టెన్ కోహ్లీ గానీ ముంబైకి చెందిన వాళ్లు కాదు. సలహా కమిటీలోని సచిన్ ముంబై ముద్దు బిడ్డ అయితే సౌరభ్ బెంగాలీ బాబు. రాష్ట్రం, ప్రాంతం ఏదైనా టీమిండియాలో కనిపిస్తున్న యువోత్సాహం, నవోత్సాహం ఎన్నెన్ని అద్భుత విజయాలను సాధించిపెడుతుందో చూద్దాం.