రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ఢిల్లీలో ధర్నా చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అది కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ ఇంటి ముందు. ఇది కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇలాంటి వైల్డ్ ఆలోచన ను అమల్లోకి పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఎవరైనా స్థానిక సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేస్తారా.. చేసినా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తారు కానీ ప్రతిపక్షంపై చేస్తారా ?. బీఆర్ఎస్ చేస్తుంది.
తెలంగాణలో రాహుల్ ప్రకటించిన ఎన్నికల హామీల్లో ఇంకా చాలా అమలు కాలేదని బీఆర్ఎస్ వాదన. ఉచిత బస్సు, రుణమాఫీతో పాటు చాలా పథకాలు అమలు చేశామని.. మిగిలినవి పెండింగ్ లో ఉంటే త్వరలో ప్రారంభిస్తామని కాంగ్రెస్ అంటోంది. కానీ ఇంకా అమలు చేయలేదని .. అమలు చేయాల్సిందేనని ధర్నాలు చేసేందుకు బీఆర్ఎస్ నిర్ణయించింది. అదేదో రాష్ట్రంలో చేస్తే ప్రభుత్వంపై పోరాటం అన్నట్లుగా ఉంటుంది.కానీ రాహుల్ గాంధీ ఇక్కడ హామీలు ఇచ్చిపోయారు కాబట్టి ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని బీఆర్ఎస్ విచిత్ర వాదనకు దిగుతోంది.
నిజానికి రాహుల్ ఇచ్చిన హామీల్లో కేసీఆర్, కేటీఆర్ ల అవినీతిపై విచారణ జరిపి జైల్లో వేస్తామన్న అంశాలు కూడా ఉన్నాయి. వాటిపైనా ఇంత వరకూ రేవంత్ దృష్టి పెట్టలేదు. వారికి సానుభూతి రప్పించడం ఎందుకులే అని సైలెంట్ గా ఉంటున్నారో మరో కారణమో తెలియదు. ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు ధర్నాలు అంటే… ఆ హామీలను కూడా రేవంత్ బయటకు తీస్తారేమోనని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కయి… ఢిల్లీకి వెళ్లి ప్రతిపక్ష నేత ఇంటి ముందు ధర్నా చేస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని సలహాలిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.