న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్.ఎస్.జి.)లో భారత్ చేరే విషయంపై అంతర్జాతీయ స్థాయిలో చాలా చర్చ జరుగుతోంది. దాని కోసం మోడీ ఎందుకు అంతగా ప్రయత్నిస్తున్నారు? చైనా, పాకిస్తాన్ దేశాలు ఎందుకు అభ్యంతరం చెపుతున్నాయి? ఎన్.ఎస్.జి.లో చేరడం భారత్ కి ఏమి లాభం? ఆ రెండు దేశాలకి ఏమిటి కష్టం, నష్టం? వంటి అనేక సందేహాలకు సమాధానమే ఈ ఆర్టికల్.
ఎన్.ఎస్.జి. దేనికి?
అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రధాన సభ్యులుగా ఉన్న ఈ ఎన్.ఎస్.జి.లో మొత్తం 48 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. విశేషం ఏమిటంటే, 1974లో భారత్ మొట్టమొదటిసారిగా అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిన తరువాత ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడి అణ్వస్త్రవ్యాప్తిని అరికట్టేందుకే ఈ ఎన్.ఎస్.జి.ని ఏర్పాటు చేసుకొన్నాయి. ఇప్పుడు దానిలోనే భారత్ సభ్యత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ తన సర్వశక్తులు ఒడ్డి మరీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. అందుకు బలమైన కారణం లేకపోలేదు.
మోడీ ఎందుకు తొందరపడుతున్నారు?
ఎన్.ఎస్.జి.లో చేరాలంటే అందుకు మొట్టమొదట అమెరికా సహకారం చాలా అవసరం. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మోడీల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు, మంచి అవగాహన ఉంది. కనుక ఎన్.ఎస్.జి.లో ప్రవేశానికి ఇదే సరైన సమయమని మోడీ భావిస్తున్నారు. ఒబామా తరువాత ఒకవేళ డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయినట్లయితే, ఇక అటువంటి ఆలోచనలు కూడా చేయనవసరం లేదని అందరికీ తెలుసు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలని మోడీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
చైనాకి ఎందుకు అభ్యంతరం?
మోడీ ప్రయత్నాలు చాలా వరకు ఫలించినట్లే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ తో అంటకాగుతున్న చైనా మోడీకి సైంధవుడులాగ అడ్డుపడుతోంది. ఒకవేళ భారత్ కి ఎన్.ఎస్.జి.లో ప్రవేశం కల్పిస్తే పాకిస్తాన్ కి కూడా కల్పించాలని పట్టుబడుతోంది. ఈ ఎన్.ఎస్.జి.లో భారత్ కి ప్రవేశం లభించినట్లయితే, ఇప్పుడు చైనా భారత్ ప్రవేశాన్ని ఏవిధంగా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందో, అప్పుడు భారత్ కూడా పాకిస్తాన్ ప్రవేశానికి అడ్డుచెప్పగలదు. ఇది మొదటి మరియు ప్రధాన కారణం. అందుకే భారత్ తో బాటు పాకిస్తాన్ కి కూడా ప్రవేశం కల్పించాలని చైనా పట్టుబడుతోంది.
ఇక చైనా లేవనెత్తుతున్న మరో అభ్యంతరం ఏమిటంటే, ఎన్.ఎస్.జి.లో చేరాలనుకొనే ఏ దేశమైన తప్పనిసరిగా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ (ఎన్.పి.టి.) మరియు కాంప్రహె టెస్ట్ బ్యాన్ ట్రీటీ (సిటిబిటి) అనే రెండు ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది అణ్వస్త్ర వ్యాప్తిని, రెండవది అణ్వస్త్ర ప్రయోగాలని నిషేధించడానికి ఉద్దేశ్యించినవి. పొరుగున పాకిస్తాన్ వంటి ధూర్త దేశాన్ని పెట్టుకొని అటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయడానికి భారత్ ఇష్టపడటం లేదు. అటువంటప్పుడు భారత్ కి ఏవిధంగా నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తారు? ఎందుకు ఇస్తున్నారు? భారత్ కి ఎన్.ఎస్.జి.లో ప్రవేశం పొందే హక్కు ఉన్నప్పుడు పాకిస్తాన్ కి మాత్రం ఎందుకు ఉండకూడదు? అని చైనా ప్రశ్నిస్తోంది. దాని ప్రశ్నలకి ఎవరి వద్దా సరైన సమాధానాలు లేవు కానీ ఎన్.ఎస్.జి.లో భారత్ ప్రవేశానికి అమెరికా ‘ఓకె’ చెప్పేసింది కనుక చాలా సభ్య దేశాలు కూడా అందుకు అంగీకరిస్తున్నాయి. చైనా అంగీకరించకపోతే భారత్ కి ఎన్.ఎస్.జి.లో ప్రవేశించడం ఎప్పటికీ అసాధ్యమే. అందుకే మోడీ చైనాని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్.ఎస్.జి.లో చేరితే భారత్ కి ఏమి లాభం?
ఎన్.ఎస్.జి.లో చేరితే భారత్ పై నేటికీ పాక్షికంగా అమలవుతున్న నిషేధాలన్నీ తొలగిపోతాయి. ఎన్.ఎస్.జి. సభ్యదేశాల నుంచి భారత్ అత్యాధునిక అణుసాంకేతిక పరిజ్ఞానం పొందగలదు. దాని సహాయంతో స్వయంగా అణువిద్యుత్ రియాక్టర్లను స్వయంగా తయారు చేసుకొని విదేశాలకి అమ్ముకొనే అవకాశం కలుగుతుంది. ఒక్క విద్యుత్ రంగంలోనే కాక, వైద్య విజ్ఞాన తదితర రంగాలకి అవసరమైన అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానం పొందగలదు. ఈ అణువిజ్ఞానంతో ముడిపడున్న అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి. అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం ప్రజల అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆ రంగాలలో స్వయంగా యంత్రపరికరాలు వగైరా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయగలదు. తద్వారా భారత ఆర్ధిక వ్యవస్థ ఇంకా బలోపేతం అవుతుంది.
ఎన్.ఎస్.జి.లో పాకిస్తాన్ కి ప్రవేశం కల్పిస్తే ఏమవుతుంది?
ఉగ్రవాదులకి నిలయంగా మారిన పాకిస్తాన్ ఎన్.ఎస్.జి.లో ప్రవేశం కల్పిస్తే, ఉగ్రవాదులకి ఇంకా అత్యాదునికమైన అణ్వస్త్ర పరిజ్ఞానం చేజేతులా అందించినట్లే అవుతుంది. ఇప్పటికే చైనా రహస్యంగా పాకిస్తాన్ కి, పాకిస్థాన్ రహస్యంగా ఇరాన్ కి అణ్వస్త్రాలు సమకూర్చిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. భారత్ చేతిలో శక్తివంతమైన అణ్వస్త్ర పరిజానం ఉన్నప్పటికీ చైనా, పాకిస్తాన్ దేశాలలాగ దొంగచాటుగా ఇరుగుపొరుగు దేశాలకి సరఫరా చేయలేదు. ఎన్నడూ అటువంటి ఆలోచన కూడా చేయబోదు. భారత్ తన అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని కేవలం విద్యుత్ ఉత్పత్తి తదితర రంగానికి మాత్రమే వినియోగిస్తోంది. ఇప్పుడు ఎన్.ఎస్.జి.లో చేరాలనుకోవడానికి కారణం కూడా అదే. ఎన్.ఎస్.జి.లో భారత్ ని అనుమతించాలా వద్దా అనే విషయం జూన్ 27-28 తేదీలలో జరిగే ఎన్.ఎస్.జి.సభ్యదేశాల సమావేశంలో తేలిపోతుంది. ఒకవేళ ఈసారి మోడీ ప్రయత్నాలు సఫలం కాకపోతే ఇక ఎన్నటికీ అవకాశం లేనట్లే భావించవచ్చు.