తెలుగు 360కి ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సంక్రాంతి సినిమాల గురించి ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సంక్రాంతికి ఆయన బ్యానర్ నుంచి బాలకృష్ణ – బాబీ సినిమా విడుదలకు రెడీ అయిన సంగతి తెలిసిందే. `ఈ సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తున్నాయి కదా, పోటీ ఎక్కువగా ఉంది కదా` అని అడిగితే… ‘నాకు తెలిసి సంక్రాంతికి పెద్ద పోటీ ఉండకపోవొచ్చు’ అంటూ ఆయనో విచిత్రమైన సమాధానం చెప్పారు.
ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి అటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఇటు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇవి కాక మరో మూడు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. వీటిలో అజిత్ సినిమా కూడా ఉంది. అయినా కూడా సంక్రాంతికి పోటీ లేదు అని నాగ వంశీ చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటూ సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో హర్టయిపోతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ విడుదల అవుతున్నా, దాన్ని పోటీగా భావించడం లేదా? చరణ్ సినిమాని నాగవంశీ లైట్ తీసుకొన్నాడా? అనే అనుమానాలు, ప్రశ్నలు తలెత్తున్నాయి.
సంక్రాంతి అంటే బాలయ్యదే. సంక్రాంతి సీజన్లో బాలయ్య సినిమా వస్తే, అది గ్యారెంటీ హిట్. ఆ ఉద్దేశంతోనే నాగవంశీ ‘మాకు పోటీ లేదు’ అన్నాడా, లేదంటే ఆరు సినిమాలు రావు, కొన్ని డ్రాప్ అవుతాయి, అలాంటప్పుడు పోటీ ఎక్కడ ఉంటుంది? అనేది నాగవంశీ ఉద్దేశ్యమా? మొత్తానికి ఈ కామెంట్లపై ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ అయితే నడుస్తోంది.