ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్షకు దిగకపోతే తుని సంఘటనలను అడ్డం పెట్టుకుని కనీసం 500 మంది కాపుఉద్యమ యువకులను రాష్ట్రప్రభుత్వం తప్పుడుకేసులతో జైలుకి పంపేదననీ , చురుకైన కుర్రోళ్ళనీ కార్యకర్తల్నీ తొక్కేసేవారనీ తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు ప్రముఖుల సమావేశం అంచనావేసింది.
అందులో పాల్గొన్న కొందరు చెప్పిన వివరాల ప్రకారం ముద్రగడ దీక్ష విరమణకు రెండురోజులు ముందు ఈ సమావేశం జరిగింది. అన్ని జిల్లాలనుంచీ వేర్వేరు పార్టీల పదవుల్లో వున్న కాపులు, ఎంపిటిసి, జడ్ పిటిసి మొదలైన అధికారిక పదవుల్లో కాపులు పాల్గొన్నారు. తెలుగుదేశం నుంచి తక్కువమంది హాజరయ్యారు!
రైళ్ళుతగలబెట్టడం, పోలీస్ స్టేషన్ పై దాడి సంఘటనల్లో నేరస్ధులిగా చూపించిన 13 మందిలో నలుగురు ఆ కార్యక్రమానికే రాలేదన్న సమాచారాన్ని దృవీకరించే బాధ్యతను ఆయాప్రాంతాల కాపు నాయకులకు అప్పగించారు.
సమావేశం నుంచే దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుని ఫోన్ లో సంప్రదించి పెద్దాయన దీక్షను విరమింపజేసేలా కృషిచేయాలి అవసరమైతే బయటపడి అడగాలి అని కోరారు.
దానిపై మంత్రి ”ముద్రగడతో సంప్రదింపుల్లో మన (రాజమండ్రి) ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కృషి ఎంతో వుంది. నేను ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడాను..ఈ సాయంత్రం మళ్ళీ మాట్లాడతాను. సమస్య పరిష్కారమౌతుందనే ఆశిద్దాం. కుదరకపోతే ఆలోచిద్దాం” అని మంత్రి చెప్పారు.
ముద్రగడ కుమారుడిని పోలీసులు కొట్టుకుంటూ అవమానకరమైన బూతులు తిడుతూ తీసుకు వెళ్ళిన సంఘటనను చర్చించారు. అది పోలీసులు చేసిన పని దానికి కూడా ముఖ్యమంత్రే బాధ్యుడా అని ఒక యువకుడు వ్యాఖ్యానించగా నవ్వు తెలుగుదేశం మాటలు మాట్లాడకు కూర్చో అని పలువురు విరుచుకు పడ్డారట!
అనంతరం రిజర్వేషన్లతో సహా కాపుప్రయోజనాలకోసం బహిరంగంగా లేదా లోపాయికారీగా ముద్రగడ పద్మనాభానికి మద్దతు ఇవ్వాలని కాపు ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తూ సమావేశం నిర్ణయించింది.