ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా సీపిఐ ఈరోజు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చింది. మునికోటి మృతికి సంతాపంగా తిరుపతిలో నిన్న బంద్ పాటించిన కారణంగా తిరుపతికి నేడు బంద్ నుండి మినహాయింపు నిచ్చారు. ఈరోజు జరుగుతున్న బంద్ కి కాంగ్రెస్, వైకాపా, విద్యార్ధి, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. కనుక ఈరోజు తెల్లవారుజాము నుండే డిపోల నుండి ఆర్టీసీ బస్సులను బయటకు రానీయకుండా బంద్ నిర్వాహకులు అడ్డుకొంటున్నారు. అన్ని జిల్లాలలో నిరసనకారులు రోడ్ల మీద కూర్చొని లారీలు, బస్సులు తిరగకుండా చేస్తుండటంతో అత్యవసరపనుల మీద బయటకు వెళ్ళవలసిన వారు, ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన వ్యాప్తంగా అనేక విద్యా, వ్యాపార సంస్థలు, అనేక పరిశ్రమలు స్వచ్చందంగా మూసివేసి బంద్ కి మద్దతు తెలిపాయి. అనేక చోట్ల సినిమా ధియేటర్లు కూడా మార్నింగ్, మ్యాట్నీ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతున్న చోట పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి వ్యనులలో పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినప్పటికీ ఏడాదిన్నర గడుస్తున్నా ఇవ్వకుండా కుంటిసాకులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలక్షేపం చేస్తున్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పోరాటాన్ని మున్ముందు మరింత ఉదృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.