రాజకీయ పార్టీలు తరచూ సమావేశాలు నిర్వహించుకోవడం చాలా సహజమే. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా సమావేశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అందుకు కారణం రెండు రాష్ట్రాలలో అవి చాలా సందిగ్ధావస్థలో ఉండటమే!
తెలంగాణాలో తెదేపాకి దూరం అయిన తరువాత అధికార తెరాసతో స్నేహం కలుపుకోవాలని ప్రయత్నించి భంగపడిన భాజపా ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతోంది. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలని అన్నిటినీ తెరాస నిర్వీర్యం చేయడంతో అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. సరిగ్గా అటువంటి అవకాశం కోసమే భాజపా ఎదురుచూస్తోంది. ఒకపక్క కళ్ళ ముందు అంత మంచి అవకాశం కనిపిస్తున్నప్పటికీ భాజపా కూడా తెరాస ధాటిని తట్టుకొని నిలబడలేక ఆపసోపాలు పడుతోంది. ఒకవైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొంటూనే మరోవైపు తెరాస ఒత్తిళ్ళని తట్టుకొని దానిని ఎదుర్కొంటూ ముందుకు సాగవలసి ఉంటుంది.
అందుకే తెలంగాణాలో భాజపా సమావేశం జరిగినప్పుడల్లా ఆ పార్టీ నేతలు ఏమైనా సరికొత్త ఆలోచనలు, వ్యూహాలని ఆవిష్కరిస్తారా లేదా అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తుంటారు. తెరాస ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడు, అనుకూలంగా మెలుగుతూ మాట్లాడే వ్యక్తి కేంద్రమంత్రి బాదారు దత్తాత్రేయ. ఆయన తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆయన ఆవిధంగా మాట్లాడటానికి కారణం భాజపా సమావేశంలో తీసుకొన్న నిర్ణయమేనని తెలుస్తోంది. అందుకే భాజపా సమావేశాలకి రెండు రాష్ట్రాలలో కూడా ప్రాధాన్యత ఏర్పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ భాజపా నేతలు కూడా రెండు రోజులు (శుక్ర, శనివారం) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సమావేశం కాబోతున్నారు. భాజపా తెలంగాణాలో ఒకరకమైన సమస్యలు ఎదుర్కొంటుంటే, ఆంధ్రాలో మరోకరకమైన సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. పేరుకి తెదేపా మిత్రపక్షమే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంలో భాజపా కూడా భాగస్వామే అయినప్పటికీ ఆ రెండు పార్టీల మద్య అంతగా సఖ్యత లేదు. రెండు పార్టీల మద్య ఏమాత్రం సఖ్యత లేకపోయినప్పటికీ తమతమ రాజకీయ అవసరాల దృష్ట్యా విధిలేని పరిస్థితులలో కలిసి కొనసాగుతున్నాయి. తెదేపా, భాజపా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనీసం వారి లెక్కలు కూడా ఎక్కడా కలవడం లేదు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ.1.42 లక్షల కోట్లు విలువ గల ప్రాజెక్టులు, నిధులు ఇచ్చిందని భాజపా నేతలు చెపుతుంటే, అందులో నాలుగో వంతు కూడా విదిలించలేదని తెదేపా నేతలు వాదిస్తున్నారు. తెదేపాతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియని అయోమయంలో ఉన్న కారణంగానే రాష్ట్ర భాజపాకి అధ్యక్షుడుని కూడా నియమించుకోలేక పోతోంది.
ఈ నేపధ్యంలో నేడు, రేపు భీమవరంలో రాష్ట్ర భాజపా నేతలు సమావేశం అవుతుండటం చాలా ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో వారు తెదేపాని డ్డీకొని రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏమైనా ఆలోచనలు చేస్తారా లేకపోతే మొక్కుబడిగా తెదేపా ప్రభుత్వంపై రెండు విమర్శలతోనే సరిపెట్టేస్తారా చూడాలి.