గత పదేళ్ళ నుంచి ఏపీలో ఎక్కడ వరదలు వచ్చినా… కొందరి టార్గెట్ మాత్రం అమరావతి. ఇటీవల బుడమేరు దెబ్బకు బెజవాడ చిగురుటాకులా వణికిపోతే కొందరు అమరావతి మునిగింది అంటూ రాక్షసానందం పొందారు. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాకు తెలంగాణా నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా తోడైంది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విజయవాడ డ్రోన్ ఫొటోస్ పెట్టి అమరావతి మునిగింది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనికి సీఎం చంద్రబాబు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఏ రాజధాని సేఫ్ అంటూ నిలదీశారు.
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఇలా కీలక నగరాల్లో వరదలు గతంలో ప్రజలకు నరకం చూపించాయి. ప్రతీ ఏటా హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో వరదలు తరుచుగా వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వాయిగుండం దెబ్బకు బెంగళూరు, చెన్నై నగరాలు మునిగాయి. సినీ నటుల నివాసాలు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా దాదాపుగా అన్నీ మునిగాయి. ప్రజలు వరదల దెబ్బకు భయపడి తమ వాహనాలను అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇంటికి, చెన్నై సత్యభామ ఇంజనీరింగ్ కాలేజికి వరద చుక్కలు చూపిస్తోంది. ఇలా చూసుకుంటే ఆ నగరాల కంటే అమరావతి సేఫ్ అనే విషయం క్లారిటీ వచ్చింది. మొన్నటి భారీ వర్షాలకు కృష్ణా నదికి ఆ స్థాయిలో వరద వచ్చినా రాజధాని అమరావతి ప్రాంతంలోకి నీళ్ళు వెళ్ళలేదు. ఈ విషయాన్ని అక్కడి ప్రజలు కూడా స్పష్టం చేసారు. అయితే అమరావతి విషయంలో పదే పదే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు చెన్నై, బెంగళూరు నగరాలు మునిగితే మాత్రం సోషల్ మీడియాలో స్పందించడం లేదు.
పైగా అక్కడి ప్రజలపై సానుభూతి కురిపించడం గమనార్హం. విజయవాడ వరదల్లో కులాల ప్రస్తావన తెచ్చి ఆరోపణలు చేసింది వైసీపీ సోషల్ మీడియా. చివరికి వరద సాయంపై కూడా ఆరోపణలు చేసారు. ఇప్పుడు మాత్రం ఇతర రాష్ట్రాల ప్రజలపై ప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. వైసీపీ అభిమానులు ఎక్కువగా ఉండేది చెన్నై, బెంగళూరు నగరాలలోనే. రాయలసీమ నుంచి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఆ నగరాలు మునిగాయి సేఫ్ కాదు, మార్చాలనే డిమాండ్ లు మాత్రం చేయడం లేదు. ఎప్పుడో శ్రీ కృష్ణ కమిటీ గురించి మాట్లాడిన పెద్ద మనుషులు కూడా ఇప్పుడు మౌనం పాటించడం గమనార్హం.