సోషల్ మీడియా సైన్యాలు దారి తప్పి తమ తమ సొంత యుద్ధాలు చేసుకుంటున్నాయి. పేరు మాత్రం తమ పార్టీని, అధినేతలవి వాడుకుంటున్నారు. వీరి యుద్ధాలకు ఇంధనం అధినేతల కుటుంబాలే. వారిపై అసభ్యంగా ఒకరికి పోటీగా మరొకరు ప్రచారం చేసుకుంటూ వ్యాఖ్యలు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఇది ట్విట్టర్ నుంచి ప్రారంభమై యూట్యూబ్కూ పాకుతోంది. ఇప్పుడు టీడీపీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు అదే పని చేసుకుంటున్నారు.
ఇటీవల నారా లోకేష్ ఢిల్లీ పర్యటన, విశాఖకు టీసీఎస్ ప్రకటనల తర్వాత కేటీఆర్, లోకేష్ మధ్య కంపేరిజన్ అంటూ ఒకరు ప్రారంభించారు. నిజానికి ఇది ఎన్నికలకు ముందు జరిగింది. అప్పుడు కూడా రచ్చ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. ఆ కంపేరిజన్లు చివరికి వ్యక్తిగత, కుటుంబ దూషణల వరకూ చేరుకున్నాయి. ఎవరూ ఊహించనంతగా తిట్టేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి వారు తిట్టుకోవడం కాదు.. పోటీ పడి తమ అధినేతల కుటుంబాలను సోషల్ మీడియాలో నవ్వుల పాలు చేస్తున్నారు.
అసలు ఇప్పుడు రాజకీయంగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ.. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఒకరిపై ఒకరు పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. వారి ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో తమకు ఉన్న వ్యక్తిగత ఈగోల కారణంగా వారంతా ఈ పనులు చేస్తున్నారు. కాస్త కంట్రోల్ లో ఉండమని ఎవరైనా సలహా ఇస్తే.. ఎదుటివాళ్లు ఇలా అన్నారని పోస్టులు పెట్టేస్తున్నారు. అంటే సోషల్ మీడియా సైన్యాల పోరాటం.. పార్టీలకు అతీతంగా ఈగోల స్థాయికి చేరింది. వీళ్లను కంట్రోల్ చేయకపోతే… ఎక్కడికి దారి తీస్తుందో ?