తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడ్ని జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలం చేసేలా ఎన్డీఏ కూటమి నిర్ణయం లతీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ నేతలందర్నీ ఆహ్వానించారు. ఈ సమావేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ దగ్గర నుంచి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన కీలక నిర్ణయాల వరకూ అన్నింటిపై చర్చించే అవకాశం ఉంది.
మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్యానాలోనే మొదటిసారి ఎన్డీఏ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కర్టెసీ మీటింగ్లు జరిగాయి కానీ విధానాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించలేదు. హర్యానాలో జరగబోయే సమావేశంలో ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయానికి ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం ఉండేలా ఆ కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీకి చంద్రబాబును చైర్మన్ గా నియమించే అవకాశాలున్నట్లుగా ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి.
వన్ నేషన్ వన్ ఎలక్షన్, జనాభా లెక్కల సేకరణ, యూనిఫామ్ సివిల్ కోడ్ సహా అనేక కీలక అంశాలపై విధానపరమైన నిర్ణయాలను చర్చించనున్నారు. చంద్రబాబు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో చంద్రబాబు పాత్ర మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.