‘ఆర్.ఎక్స్ 100’తో ఓ ఊపు ఊపేశాడు అజయ్ భూపతి. ఆ తరవాత వచ్చిన ‘మహా సముద్రం’ ఫ్లాప్ అయ్యింది. అయితే ‘మంగళవారం’తో కాస్త ఊపిరి పీల్చుకొన్నాడు. ఇప్పుడు ఓ కొత్త సినిమా కోసం కసరత్తులు ముమ్మరం చేశాడు. విక్రమ్ తనయుడు ధృవ్ తో ఓ సినిమా చేద్దామనుకొన్నాడు అజయ్. అయితే… ఆ ప్రాజెక్ట్ ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ‘పెదకాపు’ హీరో.. విరాట్ కర్ణకు కథ చెప్పి `ఓకే` చేయించుకొన్నాడు. ధృవ్ తో చేయాల్సిన కథని, విరాట్ తో సెట్ చేశాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. దీపావళి తరవాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇది యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా అని, దాదాపు రూ.30 నుంచి 40 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని టాక్. ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు లాంఛనంగా కూడా మొదలైందని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
ఇటీవల విరాట్ సినిమా ‘నాగబంధం’ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. ఆ సినిమా ఇలా మొదలైందో లేదో, అజయ్ భూపతి సినిమాకు కూడా పచ్చ జెండా ఊపేశాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ సమాంతరంగా సాగుతుందని తెలుస్తోంది. ఇవి కాక.. విరాట్ మరో రెండు కథలు ఓకే చేశాడని సమాచారం. 2025 ప్రధమార్థంలో ఆ సినిమా మొదలవుతాయని టాక్. తొలి సినిమా ‘పెదకాపు’ ఫ్లాప్ అయినా, హీరోగా ఇన్ని సినిమాలు చేజిక్కించుకొన్నాడంటే మామూలు విషయం కాదు.