పోయిన చోటే వెతుక్కోవాలనే సామెతకు అక్షరాలా న్యాయం చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ ఆధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అన్న మీద కోపమో… ప్రజా జీవితంలో ఏ పదవి దక్కకుండా చేసారని వదిన మీద అసహనమో తెలియదు గాని ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్ షర్మిల ఇప్పుడు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షం లేని లోటు స్పష్టంగా ఉంది. వైఎస్ జగన్ ఉన్నా… ఆయన పర్యటనలు పెద్దగా చేయడం లేదు. వైసీపీ నేతలను కేసుల భయం గట్టిగానే వెంటాడుతోంది.
అందుకే ఆ పార్టీ నేతలు పెద్దగా నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం లేదు. ఉచిత ఇసుక విషయంలో పలు చోట్ల ఆరోపణలు వస్తున్నా… వైసీపీ నేతల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు ఆశించిన మేర నిరసనలు ఉండటం లేదు. అసలు మీడియాతో మాట్లాడటమే అరుదుగా మారింది. ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి షర్మిల ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇటీవల పార్టీ పదవులను ఖరారు చేసిన షర్మిల… సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. వరదల సమయంలో గట్టిగానే పర్యటనలు చేసారు.
విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలకు అన్నకంటే ముందు వెళ్ళారు. మీడియా పెద్దగా హైలెట్ చేయలేదు గాని షర్మిల మాత్రం అవకాశం వదులుకోలేదు. ఇక ఇప్పుడు ఏపీలో భారీ బహిరంగ సభకు షర్మిల ప్లాన్ మొదలుపెట్టారు. వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న కొందరు నేతలకు షర్మిల సైలెంట్ గా గాలం వేయడం మొదలుపెట్టినట్టు సమాచారం. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన నేతలతో షర్మిల రహస్య సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించినట్టుగా ప్రచారం ఊపందుకుంది.
అలాగే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కూడా షర్మిల మాట్లాడినట్టు సమాచారం. డిసెంబర్ లో లేదా జనవరిలో కర్నూలులో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఆహ్వానించి కొందరు నేతలకు కండువా కప్పాలని షర్మిల భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేతకు కూడా షర్మిల ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాడుతుంది అనే సంకేతాలు ఇచ్చేందుకు షర్మిల సిద్దమవుతున్నారు. ఇక జగన్ బెంగళూరులో ఉండటం కూడా షర్మిలకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బహిరంగకు తెలంగాణా, కర్ణాటక ముఖ్యమంత్రులను, అలాగే ఇండియా కూటమి నేతలను, కాంగ్రెస్ అగ్ర నేతలు, ప్రియాంక, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని షర్మిల భావిస్తున్నారు. మరి ఎంత వరకు వ్యూహం ఫలిస్తుందో చూడాలి.