డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళ రాజకీయాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ప్రకటించినప్పుడు ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేశారు . ఆ విషయం హాట్ టాపిక్ అయింది. డీఎంకే సోషల్ మీడియా పవన్ ను ట్రోలింగ్ చేసింది. తర్వాత అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా పొగుడుతూ ట్వీట్ చేశారు. తాజాగా అన్నాడీఎంకే పార్టీ 53 వసంతాలు పూర్తి చేసుకుంటే హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ పోస్టు పెట్టారు. ఇది కూడా చర్చనీయాంశమవుతోంది.
అయన హిందూత్వ వాదం వినిపిస్తూ… అన్నాడీఎంకేను పొగుడుతూండటం డీఎంకే వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. అన్నాడీఎంకేపై పవన్ కు అంత ఆసక్తి ఎందుకన్న చర్చ కూడా అక్కడ నడుస్తోంది. నిజానికి పవన్ కు తమిళనాడులో బీభత్సమైన ఫాలోయింగ్ ఏమీ లేదు. ఆయన సినిమాలు కనీసం డబ్బింగ్ కూడా కావు. కానీ సనాతన ధర్మ రాజకీయం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆయన అక్కడ సినిమా స్టార్ గా కన్నా రాజకీయ నేతగా గుర్తింపు పొందారు.
రాజకీయ నేతలు ముందస్తుగా ప్రణాళిక లేకుండా ఏమీ చేయరు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి చాలా రాజకీయాలు ఆ రాష్ట్రంలో జరగనున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. బీజేపీతో విడిపోయిన అన్నాడీఎంకేపై అమితమైన అభిమానం చూపించడం వెనుక ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుందని అనుకుంటున్నారు. అదేమిటో మెల్లగా క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.