తెలుగు తెరకు టెక్నాలజీ పరిచయం చేసి, దాన్ని అద్భుతంగా వాడుకోవడం ఎలాగో నేర్పించిన దర్శకుడు నిస్సందేహంగా రాజమౌళినే. వీఎఫ్ఎక్స్ విశ్వరూపం ఎలా ఉంటుందో మగధీర, ఈగ సినిమాలతో చూపించాడు రాజమౌళి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్లలో కూడా వీఎఫ్ఎక్స్ పనితీరు అబ్బుర పరిచింది. ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఐఐ) గురించి విస్త్రతంగా చర్చ నడుస్తోంది. ఏఐని ఉపయోగించి డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. చనిపోయిన నటీనటుల్ని తెరపై మళ్లీ తీసుకొస్తున్నారు. ఏఐతో పాటలూ పాడించేస్తున్నారు.
ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని రాజమౌళి అద్భుతాలే సృష్టించబోతున్నట్టు టాక్. రాజమౌళి, మహేష్‌బాబు కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్కి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం ఏఐని బాగా వాడుకోవాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీలో బాగా పండిపోయిన కొన్ని స్టూడియోలతో రాజమౌళి ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టారు. న్యూజీలాండ్ లోని ఓ స్టూడియో ఏఐ విభాగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందట. ఇప్పుడు ఆ స్టూడియోతో రాజమౌళి చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని విజువల్స్ పై కసరత్తులు కూడా మొదలెట్టారని సమాచారం. ఏఐని వాడుకోవడం వల్ల అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సాంకేతిక నిపుణులతో చాలా పని పూర్తి చేయొచ్చు. ఏఐతో తక్కువ రోజుల్లోనే ఎక్కువ అవుట్ పుట్ వస్తుంది. మహేష్ – రాజమౌళి సినిమా ఆలస్యంగా ప్రారంభమైనా, చాలా త్వరితగతిన పూర్తి చేయడానికి ఏఐ టెక్నాలజీ దోహదం చేస్తుందని రాజమౌళి భావిస్తున్నారు. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే, దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, తన సినిమాకు వాడుకోవడం రాజమౌళికి ముందు నుంచీ అలవాటే. ఇప్పుడు రాజమౌళి ఏఐలోని లోటు పాట్ల గురించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారని టాక్.