పవన్ ఎమ్మెల్యే అయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యారు. పిఠాపురానికి క్రేజ్ వచ్చింది. అది మొదట్లో ఉంటుందని అనుకున్నారు. కానీ నాలుగు నెలల తర్వాత అదే జోరు కనిపిస్తోంది. ఒకప్పుడు 50 నుంచి 60 లక్షల రూపాయల ఉండే భూములు ధరలు ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. అంత పెరిగినా లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. మాములుగా అయితే క్రేజ్ ఉంటుందని మొదట్లో కొంటారు కానీ ఆ డిమాండ్ ఉండదని అనుకున్నారు. కానీ ధరలు మాత్రం తగ్గడం లేదు.
పవన్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సైతం భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజా రియల్ భూమ్‌తో పిఠాపురం టౌన్లో రోడ్డు పక్కన ఎకరం 3 కోట్లు పలుకుతోంది. ఇంతకుముందు వరకు 50 లక్షల నుంచి కోటి 25 లక్షల రూపాయల మధ్య ఉండే ధర భారీగా పెరిగింది. పవన్ నాయకత్వంపై నమ్మకం వల్ల భవిష్యత్‌లో పిఠాపురం అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఆలోచనే ఈ రియల్ భూమ్‌కి కారణంగా చెబుతున్నారు.
ఒక్కసారిగా ఏర్పడిన డిమాండ్‌తో పిఠాపురం నుంచి చేబ్రోలు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా కొందామంటే భూములు దొరకని పరిస్థితి ఏర్పడింది. నాయకత్వంపై నమ్మకంతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. వచ్చే రెండు, మూడేళ్లలో పిఠాపురానికి ఏదో ఓ భారీ ప్రాజెక్టు పవన్ తీసుకు వస్తారని గట్టి నమ్మకంతో జనం ఉన్నారు.