ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం ‘క’ విడుదల అవుతోంది. కిరణ్ కెరీర్లోనే ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. ప్రొడక్షన్ కూడా కిరణ్ దగ్గరుండి చూసుకొన్నాడు. కథ ఓకే చేయడం నుంచి.. ఫైనల్ కాపీ రెడీ అయ్యేంత వరకూ ఓ ప్రొడ్యూసర్ లానే పని చేశాడు. ఈ సినిమా కిరణ్ కెరీర్‌కు చాలా కీలకం. అయితే దీపావళికి చాలా గట్టి పోటీ ఉంది. ఆ రోజున ఐదారు సినిమాలు విడుదల అవుతున్నాయి. ‘కంగువా’, ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ లాంటి క్రేజీ సినిమాలు దీపావళికి ఢీ కొట్టబోతున్నాయి. అయినా సరే… తన `క`ని విడుదల చేయడానికి రెడీ అయ్యాడు.
పైగా ఈ సినిమా బయ్యర్లకు చూపించి మరీ అమ్ముతున్నాడు కిరణ్. ‘మా సినిమా చూడండి.. నచ్చితేనే కొనండి’ అంటూ మార్కెటింగ్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నా, దీపావళికి తమిళంలో థియేటర్లు దొరకలేదు. అందుకే అక్కడ ఓ వారం రోజులు ఆలస్యంగా సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ప్రమోషన్లు కూడా మొదలెట్టేశాడు. ఈ సినిమాతో ఓ దర్శక ద్వయం టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. స్క్రీన్ పై పేరున్న నటీనటులెవరూ కనిపించడం లేదు. అందుకే పబ్లిసిటీ బాధ్యతలు కూడా తన భుజాలపై వేసుకొన్నాడు కిరణ్.
ఓ సినిమా కోసం హీరో ఇలా కష్టపడడం చూస్తే ముచ్చటేస్తోంది. కాకపోతే ‘క’ విజయం.. కిరణ్‌కు చాలా అవసరం. ఈ సినిమా హిట్టయితే, కొత్త కథలు చెప్పడానికి ధైర్యం వస్తుందని, హీరోగా ఓ మెట్టు పైకి ఎదుగుతానన్నది కిరణ్ ధీమా. అందుకే.. అంతలా కష్టపడుతున్నాడు. పోటీ ఉన్నా సరే, సినిమాపై నమ్మకంతో దీపావళి బరిలో దించుతున్నాడు. చూద్దాం… ఈ నమ్మకం నిలబడుతుందో, లేదో?