రాజమౌళితో సినిమా అంటే హీరోలంతా క్యూ కట్టేస్తారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, కథేమిటి? పారితోషికం ఎంత? అనే విషయాల్ని సైతం పట్టించుకోకుండా రాజమౌళికి డేట్లు ఇచ్చేస్తారు. కాకపోతే ఒకటే ఇబ్బంది. రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడేళ్లు లాక్ అయిపోవాల్సిందే. ‘గుంటూరు కారం’ తరవాత మహేష్ బాబు రాజమౌళి కోసమే అంకితం అయిపోయాడు. గుంటూరు కారం వచ్చి, దాదాపు 10 నెలలైంది. అప్పటి నుంచీ మహేష్ ఖాళీనే. ఏప్రిల్ లో మహేష్ – రాజమౌళి సినిమా పట్టాలెక్కుతుంది. అప్పటి వరకూ ఎదురు చూస్తూ కూర్చోవడం మినహా మహేష్ చేసేదేం ఉండదు. కాకపోతే.. రాజమౌళి సినిమా కోసం ఎన్నేళ్లు ఆగినా, వర్తే. దానికి మించిన ప్రతిఫలం వస్తుంది. ఈ విషయంలో సందేహం లేదు.
కాకపోతే, రాజమౌళి సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా రాబోతోందన్న విషయమే మహేష్ ఫ్యాన్స్ ని కలవర పెడుతోంది. బాహుబలి కూడా ఇలానే రెండు భాగాలుగా చేశారు. ప్రభాస్ ఆ ప్రాజెక్టులో ఐదేళ్లు ఇరుక్కుపోయాడు. అంతకు మించిన ప్రతిఫలం వచ్చింది. ప్రభాస్ కెరీర్ను హైవే ఎక్కించింది. కాబట్టి ఐదేళ్లు కేటాయించినా పెద్దగా నష్టపోయిందేం లేదు. రెండు భాగాల సినిమా అంటే మహేష్ కూడా అలా ఐదేళ్లు లాక్ అయిపోవాల్సిందే. మధ్యలో మరో సినిమా చేసే అవకాశం కూడా ఉండదు. కానీ… ఇది రూమరా? ఇందులో నిజమెంత? అనే విషయాలు తెలియాల్సివుంది. ఈ కథని రెండు భాగాలుగా చెప్పాల్సిందే అని రాజమౌళి గనుక డిసైడ్ అయితే, ఇక ఆయన్ని కాదనేవారు ఎవరూ ఉండరు. బహుశా.. మహేష్ కూడా అందుకు సిద్ధమై ఈ ప్రాజెక్టు ఒప్పుకొని ఉంటాడు. కాకపోతే… మహేష్ ఫ్యాన్సే ఐదేళ్ల పాటు ఇదే ప్రాజెక్టుని నమ్ముకొని ఉండాలి. రాజమౌళి సినిమా అంటే అప్ డేట్లు ఉండవు. బర్తడేలకు టీజర్లు రావడం ఉండదు. పండగలకు స్పెషల్ గిఫ్టులు ఉండవు. ఈ విషయాల్లో ఓపిక పట్టాలి. రాజమౌళి మైండ్ లో ఏముందన్నది ఆయన నోరు విప్పితే కానీ తెలీదు. మహేష్ – రాజమౌళి సినిమా గురించిన రకరకాల వార్తలు, పుకార్లు బయట చక్కర్లు తిరుగుతున్నాయి. వీటన్నింటికీ రాజమౌళి ఏదో ఓ రోజు సమాధానం చెప్పాలి. అప్పటి వరకూ ఈ రూమర్లు ఆగవు.