బీఆర్ఎస్ పార్టీలో చిన్న బాస్ ఒంటరి అయ్యారా…? మూసిపై పోరులో, కొండా సురేఖ విమర్శల విషయంలో పార్టీ నేతల మద్దతు ఎక్కడ…? వర్కింగ్ ప్రెసిడెంట్ గా “ప్రతిపక్ష వర్క్” కేటిఆర్ ఒక్కరే చేయడం వెనుక కారణం ఏంటీ…? ఇప్పుడు తెలంగాణా రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఏ టూ జెడ్ అన్నీ తానై వ్యవహరించిన కేటిఆర్ ఇప్పుడు విపక్షంలో కూడా పార్టీకి అన్ని బాధ్యతలను తానే మోయడం వింతగా ఉంది. మూసిపై పోరు అయినా రైతు రుణమాఫీ అయినా… హైడ్రా అయినా కేటిఆర్ ఒక్కరే పోరాడుతున్నారు.
పదే పదే మూసి పరివాహక ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి… బుల్డోజర్లు వస్తే బీఆర్ఎస్ నేతలు అండగా ఉంటారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాని కేటిఆర్ మినహా మూసి విషయంలో అండగా ఉండే బీఆర్ఎస్ నేతలు ప్రజలకు కనపడటం లేదు. కార్పొరేటర్ లు కూడా కేటిఆర్ వచ్చినప్పుడే ప్రజల వద్దకు వెళ్తున్నారు. హైడ్రా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. హరీష్ రావు అప్పుడప్పుడు మాట్లాడుతున్నా మేజర్ రోల్ మాత్రం కేటిఆర్ దే అవుతోంది. దానితో పాటుగా కేటిఆర్ రైతు రుణమాఫీ సహా రాష్ట్ర సమస్యలపై ఒంటరి పోరాటమే చేస్తున్నారు.
రుణమాఫీ విషయంలో ముందు హరీష్ రావు నుంచి ప్రభుత్వానికి గట్టి కౌంటర్లు వెళ్ళాయి. కాని తర్వాత ఆయన స్వరం తగ్గింది. కేటిఆర్ అందుకుని ముఖ్యమంత్రి రేవంత్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇక ఆ తర్వాత మూసి, హైడ్రా సమస్యలను ఎత్తుకున్నారు. కాని పార్టీ నేతలు కేటిఆర్ ను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆందోళన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో ఇంకా పార్టీ మారని ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి వారి నియోజకవర్గాల నుంచి మూసి వెళ్తున్నా మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూలుస్తున్నా కేటిఆర్ పై బాధ్యతలు వదిలేసారు.
ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ వ్యాఖ్యల విషయంలో సమంతకు, అక్కినేని కుటుంబానికి లభించిన మద్దతులో పది శాతం కూడా కేటిఆర్ కు సొంత పార్టీ నేతల నుంచి లభించలేదు. అసలు తిట్టిందే కేటిఆర్ ను అయితే… సానుభూతి మొత్తం పక్కకు వెళ్ళిందనే అభిప్రాయం కూడా ఉంది. బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం గాని, కనీసం కుటుంబ సభ్యులు గాని ఎవరూ ఈ విషయంలో రియాక్ట్ కాలేదు. కేటిఆర్ పరువు నష్టం దాఖలు చేసినా మీడియాలో కూడా అది హైలెట్ కాకపోవడం గమనార్హం.