జగన్ రెడ్డి అధికారం పోయినా తాను ఉండే ఊహాలోకపు ప్రపంచం నుంచి బయటకు రావడం లేదు. తాను ఏమి చెబితే ప్రజలు అదే నమ్ముతారని ఆయన అనుకుంటున్నారు. కళ్ల ముందు కనిపించే నిజాలను కూడా అడ్డగోలుగా అలవోకగా అబద్దాలు ఆడేస్తూ ఉంటే చూసేవారు మూర్చపోతారు. మద్యం పాలసీపై ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తన హయాంలో ప్రవేశ పెట్టిన మద్యం అంతా చంద్రబాబు బ్రాండ్లని అలవోకగా చెప్పేశారు. ఏ సూపర్ హిట్ సినిమా పేరు తోస్తే ఆ సినిమా పేరు పెట్టి మద్యం తెచ్చారని ఓ వెర్రి నవ్వు నవ్వారు. తెచ్చింది నువ్వు కదా అని ఎదుటి వాళ్లు అనుకుంటారన్న సోయి కూడా ఆయనకు లేదు.
జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక.. అన్నీ డూప్లికేట్ బ్రాండ్లు వచ్చాయి. ఒక్కకంటే ఒక్కటి మంచి లిక్కర్ బ్రాండ్ లేదు. కింగ్ ఫిషర్ సహా అన్నీ ఆపేశారు. డిస్టిలరీలను కబ్జా చేసేసి తమ సొంత మద్యం ఉత్పత్తి చేశారు. ప్రభుత్వం బోర్డుతో వైసీపీ కార్యకర్తలు ఉద్యోగులుగా ఉన్న దుకాణాల్లో అమ్మారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు. మొత్తం నగదు రూపంలో తీసుకున్నారు. ఐదేళ్ల పాటు ప్రజల రక్తం పీల్చారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తూంటే అవన్నీ చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లంటూ వితండ వాదం వినిపిస్తూ ఉంటారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు.
చంద్రబాబు వచ్చాక మద్యం పాలసీ మార్చారు. మళ్లీ ప్రైవేటు దుకాణాలకు ఇచ్చారు. డిమాండ్ ఉండే మద్యం వారమ్ముకుంటారు. అయితే ఇదే లోపభూయిష్టమని స్కాం జరుగుతోందని ఆయన అంటున్నారు. అసలు ఇందులో ఎలా స్కామ్ జరుగుతుందో ఆయన చెప్పలేకపోయారు. ఎక్కడ డబ్బులు చేతులు మారతాయో చెప్పలేదు. సొంత బ్రాండ్లు తెచ్చారా. ..సొంత డిస్టిలరీలు ఏర్పాటయ్యాయా.. అనేది చెప్పేలదు. జగన్ రెడ్డి తాను చేసిన స్కాములన్నీ ఇతరులు చేసేస్తున్నారని బురద చల్లడమే తన రాజకీయంగా మార్చుకున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం సిగ్గుపడకుండా అదే చేస్తున్నారు.