సాధారణంగా అధికార, ప్రతిపక్షాల నేతలు చేసుకొనే సవాళ్లు, ప్రతిసవాళ్ళని వారు ఎన్నడూ సీరియస్ తీసుకొన్న దాఖలాలు లేవు. అందుకే ప్రజలు కూడా వాటిని కాలక్షేపం కోసమే చూస్తుంటారు. తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె. జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఒక సవాలు విసిరారు. ఆ సవాలులో ఆయన చెప్పిన కొన్ని విషయాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఎన్నికల సమయంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
జానారెడ్డి దానిని గుర్తుచేసి మాట్లాడుతూ “మా ప్రభుత్వం 4శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకనే నానా కష్టాలు పడింది. కానీ కెసిఆర్ ఏకంగా 12 శాతం ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. అది సాధ్యం కాదని ఆయనకీ తెలుసు అందరికీ తెలుసు. ఆయన ఆ హామీని నిలబెట్టుకొంటే నేను రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకొంటాను. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులని అన్నిటినీ పూర్తి చేసి కోటి ఎకరాలకి నీళ్ళు అందిస్తే నేనే ప్రజలలో తిరిగి తెరాస ప్రభుత్వం తరపున ప్రచారం చేస్తాను. అక్కడో 10 ఇళ్ళు, ఇక్కడో 10 ఇళ్ళు కట్టేసి వాటినే అందరికీ చూపిస్తూ పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇచ్చేసినట్లు కెసిఆర్ మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రంలో చాలా ఇళ్ళకి మంచి నీళ్ళ కుళాయిల కనెక్షన్లు ఇస్తే, రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా తానే ప్రతీ ఇంటికీ మంచినీళ్ళు అందిస్తున్నట్లు కెసిఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారు. కెసిఆర్ మాటలకి, చేతలకి ఎక్కడా పొంతన ఉండదు,” అని జానారెడ్డి విమర్శలు గుప్పించారు.
తెలంగాణాలో ముల్సిమ్లకి 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని కెసిఆర్ హామీ ఇస్తే, ఆంధ్రాలో కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఏపిలో మాత్రం ముద్రగడ పద్మనాభం చాలా గట్టిగానే నిలదీస్తుండటం చేత మంజునాథ కమీషన్ ఏర్పాటు చేయక తప్పలేదు. కానీ తెలంగాణాలో అటువంటి ప్రయత్నాలే చేయడం లేదు. ఆయన అదృష్టం కొద్దీ తెలంగాణాలో ముస్లింలెవరూ కెసిఆర్ ని నిలదీయడం లేదు. ఒకవెల్ నిలదీస్తే కెసిఆర్ కూడా చంద్రబాబు నాయుడులాగే చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎదుర్కొన్నా కూడా ఏకంగా 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.