Love Reddy Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్-
ఈరోజుల్లో చిన్న సినిమా గట్టెక్కడం చాలా కష్టమైపోయింది. అయితే… హీరో ఇమేజ్, క్రేజ్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలి. లేదంటే… టీజర్, ట్రైలర్లో చూపించే కంటెంట్ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయాలి. కనీసం టైటిల్ తోనైనా వాళ్లని కట్టిపడేయాలి. ‘లవ్ రెడ్డి’ అనే టైటిల్ లో కాస్త ఆసక్తి కనిపించింది. టీజర్, ట్రైలర్లలో కథేమిటో చెప్పకపోయినా… సినిమాలో ఏదో మెస్మరైజింగ్ పాయింట్ ఉంటుందేమో అనే భరోసా కలిగింది. మరింతకీ ఈ లవ్ రెడ్డిలో ఏముంది? టైటిల్ లోనే నవ్యత కనిపించిందా, అది సినిమాలోనూ ఉందా?
నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర)కు ముఫ్ఫై ఏళ్లు. వయసు దాటిపోతున్నా పెళ్లి కాదు. ఎన్ని పెళ్లి చూపులకు వెళ్లినా అమ్మాయి నచ్చక రిజెక్ట్ చేస్తుంటాడు. అలాంటి రెడ్డి.. తొలి చూపులోనే దివ్య (శ్రావణీ రెడ్డి)ని ప్రేమిస్తాడు. దివ్య కూడా రెడ్డితో స్నేహంగా ఉంటుంది. ఇద్దరూ తమ మనసులో ఏముంది? అనే విషయాన్ని బయట పెట్టరు. కానీ.. రెడ్డి మాత్రం దివ్య తనని ప్రేమిస్తోందని, తనంటే ప్రాణమని భావిస్తాడు. ఇంట్లో కూడా ఇదే విషయం చెబుతాడు. తీరా చూస్తే.. దివ్య తండ్రి (ఎన్.టి.రామస్వామి)కి తనకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలన్న విషయంలో కొన్ని పట్టింపులు ఉంటాయి. తను కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగి అయి తీరాలని భావిస్తాడు. రెడ్డి మాత్రం ఓ కంపెనీలో పార్టనర్. దివ్య కోసం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని తీర్మాణించుకొంటాడు. మరింతకీ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం దక్కిందా, అసలు దివ్య నిజంగానే రెడ్డిని ప్రేమిస్తోందా? ఈ వివరాలు తెలియాలంటే `లవ్ రెడ్డి` సినిమా చూడాల్సిందే.
ప్రతీ సినిమాకీ ప్రారంభం, ఇంట్రవెల్ బ్యాంగ్, ముగింపు చాలా అవసరం. కీలకం కూడా. ఇవన్నీ కుదిరితేనే మంచి కథ తయారవుతుంది. అయితే నవతరం దర్శకులు వీటిలో ఏదో ఓ పాయింట్ పై దృష్టి పెడుతున్నారు. ‘లవ్ రెడ్డి’ చూస్తే… దర్శకుడు ముందుగా ముగింపు రాసుకొని, ఆ తరవాత మిగిలిన కథ అల్లుకొన్నాడేమో అనిపిస్తుంది. ‘లవ్ రెడ్డి’ సినిమా మొత్తం ఎలా ఉన్నా, ముగింపు మాత్రం కదిలిస్తుంది. క్లైమాక్స్ ప్రేక్షకుడ్ని కాసేపు కుదిపేస్తుంది. ఆ విషయంలో అనుమానం లేదు. కానీ మిగిలిన కథ, దాన్ని నడిపించిన విధానం దగ్గరే అసలు పేచీ వచ్చింది.
హీరోకి ఓ క్యారెక్టరైజేషన్ ఉంది. తను ఎక్కువగా ఇమాజిన్ చేసుకొంటుంటాడు. ఈ విషయం ఒకట్రెండు సన్నివేశాల్లో దర్శకుడు చెప్పాడు కూడా. నిజానికి ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఈ కథకు కీలకం కూడా. కానీ.. హీరో క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల మనసుల్లో నాటకుపోయేలా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు. ‘మాది నిబ్బా నిబ్బీ లవ్ స్టోరీ కాదు’ అంటుంటాడు హీరో. అంటే చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనే ఉద్దేశ్యమన్నమాట. అయితే ఆ మెచ్యూరిటీ ఈ లవ్ స్టోరీలో కనిపించదు. అమ్మాయి నవ్వితే, కాసేపు మాట్లాడితే, ఫ్రెండ్లీగా మూవ్ అయితే దాన్ని లవ్ అనుకోవడం నిబ్బా – నిబ్బీ స్టైల్. అందులో ఎలాంటి మెచ్యూరిటీ ఉండదు. దాన్ని హీరో తనకు తాను ఆపాదించుకోవడం ఈ కథకూ, హీరో క్యారెక్టరైజేషన్‌కూ అతకలేదు. హీరోయిన్ తో బస్సు ప్రయాణం, తనతో ఫ్రెండ్లీ ముచ్చట్లూ.. వీటితోనే టైమ్ పాస్ చేసేశాడు దర్శకుడు. దాంతో.. చూసిన ఎమోషనే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఎక్కువగా నమ్మింది ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్. అవి రెండూ బాగున్నాయి. కానీ మధ్యలో ఫిల్ చేసిన సీన్స్ లో మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేకుండా చప్పగా సాగాయి. ఇక్కడ దర్శకుడు పనితనం చూపించగలిగితే.. `లవ్ రెడ్డి` కచ్చితంగా ఓ కొత్త తరహా ప్రేమ కథ అయ్యేది.
హీరోయిన్ మనసులో ఏముందో హీరో తెలుసుకోడు. కానీ ఆ అమ్మాయి తనని లవ్ చేస్తోందని తనలో తానే ఊహించేసుకొంటాడు. ఇది హీరో క్యారెక్టరైజేషన్. దీన్ని ఒకట్రెండు సీన్లలో చెప్పేయొచ్చు. కానీ దీన్నే పట్టుకొని సినిమా అంతా లాగాలని చూశాడు. ఓ దశలో హీరో క్యారెక్టర్ `సైకో` టర్న్ తీసుకుంటుంది. అది అనవసరమైన ఎత్తుగడ. అయితే చివరి 20 నిమిషాలూ మాత్రం దర్శకుడు చాలా పకడ్బందీగా తీశాడు. అక్కడ కథ కీలకమైన మలుపు తీసుకొంటుంది. అసలు ‘సైకో’ ఎవరో అర్థమవుతుంది. ఈ లవ్ స్టోరీని చాలా బలమైన సన్నివేశంతో ముగించిన తీరు బాగుంది. కాకపోతే… అంతకు ముందు కథని నడిపిన తీరు వల్ల క్లైమాక్స్ లో అంత ఎమోషన్ ఉన్నా, ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం. హీరో క్యారెక్టరైజేషన్‌ని ఇంకా బాగా డీల్ చేయగలిగి, అందులోంచి ఫన్ జనరేట్ చేయగలిగితే ఫస్టాఫ్ గట్టెక్కేసేది. సెకండాఫ్ లో ఎలాగూ ఎమోషన్ ఉంది కాబట్టి ‘లవ్ రెడ్డి’ ప్రయత్నం నెరవేరేది.
ఈ సినిమాలో కనిపించిన వాళ్లంతా కొత్తవారే. హీరో, హీరోయిన్లతో సహా. అంజన్, శ్రావణీ రెడ్డి తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. ముఖ్యంగా శ్రావణి పద్ధతిగా కనిపించింది. అంజన్ కొన్ని ఎమోషన్ సీన్లలో సహజంగా నటించాడు. కాకపోతే.. తెలిసిన నటీనటులు అయితే ఆ పాత్రలు ఇంకాస్త బలంగా పండేవి. హీరోయిన్ తండ్రిగా నటించిన రామస్వామికి ఎక్కువ మార్కులు పడతాయి. ఈ సినిమా క్లైమాక్స్ లో తనదే సింహ భాగం. మిగిలిన నటీనటులు బాగా చేశారు. వాళ్లంతా సహజంగా నటించారు.
సాంకేతిక విభాగంలో సంగీతానికి ఎక్కువ మార్కులు పడతాయి. నేపథ్య సంగీతం చాలా ఇంపాక్టబుల్ గా ఉంది. ప్రతీ సీన్లోనూ ఓ బీజిజం హంట్ చేస్తుంది. సన్నివేశంలో బలం లేకపోయినా నేపథ్య సంగీతంతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు సంగీత దర్శకుడు. తనకు కచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. కెమెరా పనితనం కూడా ఆకట్టుకొంటుంది. విజువల్స్ బాగున్నాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. లొకేషన్స్ సహజంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రతీ పాత్ర.. మాండలికాన్ని ఒడిసి పట్టుకొంది. తెరపై 40 పాత్రలు కనిపిస్తే.. నలభై ఒకే టెంపోలో మాట్లాడతాయి. ఈమధ్య కాలంలో రాయలసీమ మాండలికాన్ని ఇంత అందంగా పలికించిన సినిమా మరోటి లేదు. నిర్మాణ విలువలు తగిన స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు క్లైమాక్స్ ని బాగా హ్యాండిల్ చేశాడు. మిగిలిన సినిమానీ ఇదే స్థాయిలో నడిపిస్తే.. మరింత బాగుండేది. ఈమధ్య సినిమాల్లో తాగుడు, లిప్ లాక్ దృశ్యాలూ ఎక్కువైపోయాయి. ఓ ప్రేమకథే అయినా.. వాటి జోలికి ఎక్కడా పోలేదు దర్శకుడు. కనీసం హీరో చేత సిగరెట్ కూడా ముట్టించలేదు. హీరోయిన్ నడుము కూడా చూపించకుండా జాగ్రత్తపడ్డాడు. ఇవన్నీ చిన్న సంగతులే కావొచ్చు. కానీ అభినందించదగిన అంశాలు.
తెలుగు360 రేటింగ్: 2.25/5
-అన్వర్-