విలువలు విశ్వసనీయత గురించి మీరుర మాట్లాడకండి సార్ అని ఆయనకు సన్నిహితులైన వారు.. నేరుగా చెప్పలేక మీడియా, సోషల్ మీడియాల్లో నెత్తి నోరు బాదుకుంటున్నారు. ప్రజల మన గురించి ఏం అనుకుంటున్నారో వాటిని ఎదుటి వాళ్లపై రుద్దే ప్రయత్నం చేస్తే అది నమ్మేంత అమాయకులుగా జనాన్ని పరిగణించవద్దని సలహాలు వస్తూనే ఉన్నాయి. పథకాలకు ఎక్కువ డబ్బులు ఇస్తారన్న ఆశతోనే టీడీపీకి ఓట్లేశారని మాయలో ఉండొద్దని ఎంతో మంది చెబుతున్నా ఏదో లోకంలోనే ఉంటున్నారు. చివరికి తాను గొప్ప సత్య హరిశ్చంద్రుడ్నని చెప్పుకుంటే అందరూ భళ్లున నవ్వుతారని తెలిసినా ఆయన అదే పని చేస్తున్నారు. పాలిటిక్స్ లో బేసిక్స్ తెలియకుండా ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్న జగన్ రాజకీయం వైసీపీ నాయకుల్ని నిర్వేదంలో పడేస్తోంది.
ప్రజల ఐక్యూకు పరీక్ష పెడతారా ?
ప్రజలకు ఏమీ గుర్తుండదు… రెండు నెలల్లో అంతా మర్చిపోతారని వైఎస్ ఒకప్పుడు అనేవారు. జగన్ రెడ్డికి తండ్రి మాటలు బాగా ఎక్కేసినట్లున్నాయి. రెండు నెలల కిందటిదే అందరికీ గుర్తుండదు..తన ఐదేళ్ల పాలన ఎలా గుర్తుంటుందని ఫిక్సయిపోయారు. అందుకే తన హయాంలో అమ్మిన పిచ్చి బ్రాండ్ల మద్యం, ఇసుక దందా అంతా చంద్రబాబే చేశారని చెప్పుకొస్తున్నారు. ఐదేళ్ల పాలన అంతా అడ్డగోలు అబద్దాల మయం. ఒక్కటంటే ఒక్క హామీని నిజాయితీగా నెరవేర్చలేదు. అయినా తాను ఒక్క అబద్దం ఆడి ఉంటే ప్రజలు దండలు వేసేసేవారని చెప్పుకుంటున్నారు. అంటే ప్రజలు అంతా మర్చిపోయి ఉంటారని ఆయన అనుకుంటున్నారు.
కర్రుకాల్చి వాత పెట్టింది ఎందుకు ?
జగన్ రెడ్డి పాలన కూడా ఓ మాయా ప్రపంచంలో కూర్చుని చేశారు. ప్రతి దానికి సినిమా సెట్టింగులు.. అదే సెటప్పులు.. షూటింగ్లు చేయించుకున్నారు. సాధారణ జనం ఏమనుకుంటారో ఆలోచించలేదు. చివరికి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తరవాత కూడా ఆయన ఆ బాక్సుల్ని నిందిస్తున్నారు కానీ రియాలిటీలోకి రావడం లేదు. ఆయన రావడం లేదా లేకపోతే అలా నటించి మానసిక తృప్తిని పొందుతున్నారా అన్నది ఆయనకే తెలియాలి. కనీసం తెర వెనుక అయినా ఆయన తప్పుల్ని తెలుసుకుంటే మాటల్లో,చేతల్లో అయినా కొంచెం మార్పు వచ్చేదేమో !
మరో ఇరవై ఏళ్లు జగన్ పాలన అంటే భయపడతారు !
ఐదేళ్లు జగన్ పాలన చూసిన ఎవరైనా మరో ఇరవై ఏళ్లు మర్చిపోనంత భయంకరంగా ఉంది. ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేశారు. అభివృద్ధి అంటే దండగనుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచడం ఓ మిథ్య అనుకున్నారు. తలా కొద్దిగా డబ్బులు పడేసి తాము ఇచ్చే పిచ్చ మద్యం తాగేస్తే.. అదే ప్రజలకు పదివేలు అనుకున్నట్లుగా పాలన చేశారు. మరోసారి అలాంటి పరిస్థితి రావాలని మరో ఇరవై ఏళ్ల వరకూ ఎవరూ కోరుకోలేరు. పరిస్థితిని గమనించి ఇప్పటికే ఊహాలోకం నుంచి ఊడి పడి నిజంలోకి వచ్చి.. కాస్త నిజాయితీగా రాజకీయాలు చేస్తే జగన్కు ప్రతిపక్ష నేత హోదా అయినా వస్తుంది