కెసిఆర్, చంద్రబాబు పరిచయం అవసరం లేని పేర్లు ఇవి. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, మంత్రి కె. తారక రామారావు కూడా (కెటిఆర్) వారిద్దరికంటే చాలా పాపులర్ అయిపోయారిప్పుడు. తాజా సర్వేలో కెటిఆర్ వారిద్దరికంటే చాలా ముందున్నట్లు తేలింది. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో చాలా మంది నెటిజన్లు కెటిఆర్ కి సంబంధించిన వార్తల కోసమే వెతుకుతున్నట్లు తేలింది. కెసిఆర్ కంటే 5 రెట్లు ఎక్కువగా కెటిఆర్ కోసం నెట్ లో సెర్చ్ చేస్తున్నారుట!
కెటిఆర్ తరువాతే కెసిఆర్. వారిద్దరి తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం నెట్ లో జనాలు వెతుకుతున్నారుట! జగన్ నిత్యం ఏదో రాష్ట్రంలో ఏదో ఒక హడావుడి చేస్తున్నప్పటికీ, ఈ విషయంలో ఆయన కంటే చంద్రబాబే ముందున్నారుట! అయితే గుంటూరు, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు వాసులు మాత్రం జగన్ కోసం వెతుకుతున్నారుట! తెలంగాణాలో ఇప్పుడు చంద్రబాబు గురించి వెతికేవారు బాగా తగ్గిపోయారుట! కానీ జగన్ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారుట!
నెట్ లో ఈ వెతుకలాటలు వారి పాపులారిటీ గ్రాఫులుగానే భావించవచ్చు. రాజకీయ, పరిపాలనా వ్యవహారాలలో మంచి దక్షత, చురుకుదనం ప్రదర్శిస్తూ, దేశ విదేశాలలో ప్రముఖులను, ప్రజలను ఆకట్టుకొనే విధంగా వ్యవహరిస్తూ అప్పగించిన అన్ని పనులను చాలా సమర్ధంగా చక్కబెట్టేస్తున్న మంత్రి కెటిఆర్ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు కనుక ఈవిషయంలో ఆయన అందరి కంటే ముందు ఉండటం చాలా సహజమే. ఉద్యమ సమయంలో కెసిఆర్ కోసం నెట్ లో చాలా జోరుగా వెతుకులాటలు సాగేవి. తెలంగాణా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు కనుక ఇప్పుడు కూడా నెట్ లో ఆయన కోసం వెతకడం సహజమే.
ప్రచారాన్ని ఎక్కువగా ఇష్టపడే చంద్రబాబు నాయుడు ఈవిషయంలో వారిద్దరి కంటే వెనుకబడి ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఓటుకి నోటు కేసు, అమరావతి శంఖుస్థాపన సమయాలలో నెటిజన్లు ఆయన కోసం వెతికేరేమో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఆయనపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకొన్నారు. కనుక ఆ సమయంలో ఆయన పాపులారిటీ గ్రాఫ్ బాగానే ఉండేది. కానీ రెండేళ్ళ తరువాత కూడా రాష్ట్రంలో ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు మొదలవకపోవడం, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోవడం, భాజపాతో గొడవలు, కేంద్ర సహకారం కొరవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అనేక హామీలు గట్టున పెట్టేయడం వంటి కారణాల చేత క్రమంగా ప్రజల ఆశలు సన్నగిల్లుతున్నాయి. అదే నెట్-గ్రాఫ్ లో ప్రతిఫలిస్తోందని చెప్పవచ్చు. కనుక ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అప్రమత్తం అయ్యి రాష్ట్రంలో అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడం మంచిది.