పాత్రికేయుడు ఉన్నది ప్రశ్నించడానికే. కానీ ఆ ప్రశ్న సహేతుకంగా ఉండాలి. నిజాన్ని రాబట్టేలా ఉండాలి. సమాజంలో ఓ చర్చకు నాంది పలకాలి. మార్పుకు బీజం వేయాలి. కానీ సినిమా జర్నలిజంలో ఇవేం మచ్చుకైనా కనిపించవు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఇక్కడ నిజాల్ని వెలికితీయడానికీ, మార్పుకు బీజం వేయడానికో ఛాన్స్ ఉండదు. సినిమావాళ్ల నుంచి ప్రేక్షకులు తెలుసుకోవాలనుకొనే విషయాల్ని సినిమా జర్నలిస్టులు బయటపెడుతుంటారు. ఎందుకంటే వాళ్ల చేతిలో మైక్ ఉంటుంది. వాళ్లు సెలబ్రెటీలకు దగ్గరగా ఉంటారు. ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి.
కానీ ఆ ప్రశ్నలు మెల్లమెల్లగా హద్దులు దాటుతున్నాయి. ఓ సినిమా ప్రెస్ మీట్ కు వెళ్లి, ఆ సినిమాకు సంబంధం లేని, అవసరం లేని ప్రశ్నల్ని అడిగి, ఏదోలా కాంట్రవర్సీ చేసి, సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవ్వాలని చూస్తున్నారు కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులు. ఆమధ్య ఓసారి ‘హీరోయిన్ ఒంటి మీద ఉన్న పుట్టు మచ్చలెన్ని’ అనే ప్రశ్న అడిగి ఓ పాత్రికేయుడు నవ్వుల పాలయ్యాడు. కొంతకాలం అతన్ని ప్రెస్ మీట్లకు రానివ్వకుండా చర్యలు తీసుకొన్నారు కూడా. అయితే ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఇంకాస్త వికృతంగా తయారైంది. పొట్టేల్ ప్రెస్ మీట్ లో.. కాస్టింగ్ కౌచ్ గురించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న చాలా ఇబ్బందికరంగా అనిపించింది. హీరోయిన్లు కమిట్మెంట్ లేనిదే సినిమాలు చేయరని, కమిట్ మెంట్ కి ఒప్పుకొంటే ఒక రేటు, వద్దంటే ఒక రేటు అంటూ ఓ మహిళా జర్నలిస్టు లైవ్లో స్టేట్మెంట్ ఇవ్వడం హద్దులు దాటే వ్యవహారమే. ప్రస్తుతం ఈ టాపిక్పైనే మీడియా సర్కిల్స్ లో హాట్ చర్చ నడుస్తోంది.
అసలు ప్రెస్ మీట్లలో Q&A పద్ధతి మొదలైనప్పటి నుంచీ ఈ జాడ్యం పట్టుకొంది. ప్రశ్న అడిగే జర్నలిస్టుల్నీ కెమెరాలో బంధించడంతో.. మెల్లమెల్లగా కొంతమంది జర్నలిస్టులకూ ఫేమ్ వచ్చింది. కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగితేనే వైరల్ అవుతామని భావించిన కొంతమంది… ఆ దారే ఎంచుకొన్నారు. కొన్నిసార్లు సినిమా ప్రమోషన్లకు ఈ Q&A కొంతమేర దోహదపడుతోంది కూడా. అందుకే నిర్మాతలు కూడా Q&A కోరుకుంటున్నారు. అలా… ఈ ప్రహసనం కొనసాగుతూనే ఉంది. అయితే అప్పుడప్పుడూ… ఇలాంటి అర్థం పర్థం లేని ప్రశ్నల వల్ల లైవ్లో.. జర్నలిస్టుల పరువు పోతోంది. దీనిపై జర్నలిస్టు యూనియన్ కూడా ఆగ్రహంగా ఉంది. Q&A లను వీలైనంత వరకూ నిషేధించాలని, లేని పక్షంలో ప్రశ్నలు అడిగే పాత్రికేయుడుపై కెమెరా ఫోకస్ చేయడం మానేయాలన్నట్టుగా పీఆర్వోలకు సూచనలు చేసింది. పాత్రికేయ వృత్తిపై అగౌరవం కలిగేలా చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవడానికి సైతం ఆలోచిస్తోంది.