నిర్మాతగా నాని తనదంటూ ఓ మార్క్ సృష్టించుకొన్నాడు. తన అభిరుచి మేర కథల్ని ఎంచుకొని, సినిమాల్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా నాని ప్రయాణం అటు లాభాల్ని తెచ్చిపెడుతోంది, ఇటు విమర్శకుల ప్రశంసలూ అందుకొంటోంది. తాజాగా నాని బ్యానర్లో ‘కోర్ట్’ అనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదో కొర్ట్ రూమ్ డ్రామా అనే సంగతి టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది.
అయితే.. ఈ సినిమాలో ఓ వివాదాస్పద చట్టం గురించి చర్చిస్తున్నారని సమాచారం. అదే.. ఫోక్సో యాక్ట్. మైనర్లపై జరుగుతున్న అత్యాచాలన్నీ ఈ ఫోక్సో చట్టం పరిధిలోకి వస్తాయి. ఇటీవల జానీ మాస్టర్ అరెస్టయ్యింది కూడా ఈ కేసులోనే. ఇప్పుడు ఈ కేసు చుట్టూనే కోర్ట్ సినిమా తీరగబోతోందని సమాచారం. జానీ మాస్టర్ వల్ల ఫోక్సో చట్టం ఏమిటి? అందులో ఏముంది? అనే విషయాలు మరింత వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. దాన్ని సైతం ఈ కథలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఫోక్సో అనేది చాలా సున్నితమైన విషయం. దాన్ని డీల్ చేయడం అంత తేలికైన సంగతి కాదు. అయితే కొత్త దర్శకుడు జగదీష్ బలమైన స్క్రిప్టు రాసుకొన్నాడని, ఈ కథలో క్లైమాక్స్ అందరినీ కదిలించి వేస్తుందని, ఆ క్లైమాక్స్ నచ్చే నాని ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని తెలుస్తోంది.