చిన్న హీరోల్లో అత్యంత బిజీగా ఉన్నవాళ్లెవరో లిస్టు తీస్తే, ఆ జాబితాలో సుహాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. యేడాదికి మూడు నాలుగు సినిమాలు అవలీలగా ఊది పారేస్తున్నాడు. సినిమా సినిమాకీ పారితోషికం పెంచేస్తున్నాడు. సుహాస్ సినిమాలకు ఓటీటీ మార్కెట్ కాస్త బలంగా ఉండడంతో, థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నా, సుహాస్ పై పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ‘జనక అయితే గనక’ సినిమా తరవాత సుహాస్ కాస్త గ్యాప్ తీసుకోవాలనుకొంటున్నాడు. తన పాత్రలు మరీ రెగ్యులర్ అయిపోతున్నాయని, ఓ కొత్త తరహా కథ చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఈ ప్రయత్నంలో తన దగ్గరకు ఓ సోషియో ఫాంటసీ కథ వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ అటు ఇటుగా రూ.20 కోట్ల వరకూ అవుతుంది. సుహాస్‌పై ఇది రిస్కీ ప్రాజెక్టే. కాకపోతే సుహాస్‌కు ఈ కథపై గట్టి నమ్మకం. ఎలాగైనా సరే, తన ఇమేజ్‌నీ, మార్కెట్ నీ మార్చే సినిమా అవుతుందని భావిస్తున్నాడు. అందుకే ఈ కథని ఇండస్ట్రీలో తనకు తెలిసిన నిర్మాతలందరి దగ్గరకూ పంపుతున్నాడని తెలుస్తోంది. సుహాస్‌పై రూ.10 నుంచి 15 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు రెడీగానే ఉన్నారు. కానీ 20 కోట్లంటే ఆలోచిస్తున్నారు. అక్కడే బేరాలు సాగుతున్నాయి. మరో రూ.5 కోట్ల బడ్జెట్ పెంచుకోవడానికి నిర్మాత రెడీగా ఉన్నా, ఖర్చులన్నీ తగ్గించి ఈ సినిమాను రూ.15 కోట్లలో పూర్తి చేయొచ్చని దర్శకుడు డిసైడ్ అయినా, ఈ ప్రాజెక్ట్ ఆన్ అయిపోయినట్టే.