ప్రముఖ ఆర్జే, బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అరెస్ట్ అయ్యాడంటూ ఈ రోజు ఉదయం నుంచీ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. యూ ట్యూబర్ హర్ష సాయి తనని మోసం చేశాడని మిత్రా శర్మ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంతో తనపై శేఖర్ బాషా అసత్య ప్రచారం చేయిస్తున్నాడని, కొంతమంది యూ ట్యూబర్లకు డబ్బులు ఇచ్చి మరీ, తనపై పుకార్లు పుట్టిస్తున్నాడని మిత్రా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు, ఈ మేరకు శేఖర్ బాషాని అరెస్ట్ చేశారన్నది ఆ వార్తల సారాంశం.
దీనిపై శేఖర్ బాషా స్పందించాడు. తనని ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఇదంతా అబద్ధపు ప్రచారమని తిప్పి కొట్టాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. ప్రో కబడ్డీ ప్రమోషన్ నిమిత్తం ఉదయం గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లానని, అక్కడ తన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయిందని, ఆ తరవాత ఇంటికొచ్చి చూస్తే.. మూడు గంటల్లో చాలా రచ్చ చేసినట్టు అర్థమైందని, ఈ పుకార్లని ఎవరూ నమ్మొద్దని కోరాడు. అంతేకాదు.. సాక్ష్యంగా ‘మళ్లీ ఇది పాత వీడియో అనుకొంటారు. కావాలంటే ఈ న్యూస్ పేపర్ చూడండి’ అంటూ ఈరోజు దినపత్రికను కూడా చూపించాడు. రాజ్ తరుణ్ వ్యవహారంలో బయటకు వచ్చి, రాజ్ తరపున మాట్లాడాడు శేఖర్. అప్పుడు వచ్చిన ఇమేజ్ తో… బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఎన్నో రోజులు మనలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ హర్షసాయి విషయంలో మళ్లీ శేఖర్ వార్తల్లోకి ఎక్కాడు.