`ఒక్క ఐడియా సంపద సృష్టిస్తుందని అది భావితరాలకు కామధేనువులా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి నిర్మాణ పనులను ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభించిన ఆయన అమరావతి నిధుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని తప్పుడు ప్రచారాలు చేశారని కానీ అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దామన్నారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో చేపట్టిన అభివృద్ధికి నిధుల కేటాయింపు అనే సమస్యే రాలేదన్నారు. ఎందుకంటే సైబరాబాద్ అభివృద్ది వెనుక ఉన్నది ఐడియా మాత్రమేనన్నారు. హైదరాబాద్ లో భూమి ఉంది, నీళ్లు తీసుకొచ్చాం .. రాబోయే రోజుల్లో సుందర నగరంగా మారుతుందని చెప్పి పెట్టుబుడులు తీసుకు వచ్చి అభివృద్ది చేశామన్నారు.
మేము వేసిన ఔటర్ రింగ్ రోడ్ ను మార్కటైజేషన్ చేసుకుని వేల కోట్లు ప్రభుత్వం సంపాదించుకుంటోందని గుర్తు చేసారు. ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టించాం. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని.. అదీ అభివృద్ది.. సంపద సృష్టి అని చంద్రబాబు గుర్తు చేశారు.
అమరావతికి కూడా ప్రభుత్వం నేరుగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. అసంపూర్తిగా ఉన్న సీఆర్డీఏ భవనాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఇతర అన్ని పనులు అమరావతిలో ప్రారంభం అవుతాయి. టెండర్ల ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నారు.