రాజకీయ ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడికి పోయింది. రెండింటిలోనూ బీజేపీ నేతలే కీలకం. ఓ వైపు బండి సంజయ్ నేతృత్వంలో గ్రూప్ వన్ విద్యార్థల పోరాటంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పోలీసులు పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేశారు. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది .
మరో వైపు ముత్యాలమ్మ గుడి పై జరిగిన దాడి విషయంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున గుమికూడి ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున గుడి వైపు వెళ్లారు. ఈ రెండు ఘటనలతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకునేది లేదని ప్రకటించారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో తాము మిస్సయ్యామని అనుకున్నారేమో కానీ హడావుడిగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో ఇద్దరు ముగ్గురు వచ్చారు. వారిని చూసి నిరుద్యోగులు మండిపడ్డారు. దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని సురక్షితంగా తప్పించారు. అప్పటి వరకూ గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలు అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసింది. బీఆర్ఎస్ నేతల్ని తరిమేసే సరికి.. బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పుకోవడం ప్రారంభించారు.
మొత్తంగా హైదరాబాద్ రాజకీయ ఆందోళనలకు కేంద్రంగా మారింది.