అనుష్క… సౌతిండియాలోనే టాప్ హీరోయిన్. అనుష్క అందరికీ కావాల్సిన కథానాయిక. అగ్ర కథానాయకులకూ తనే కావాలి, ప్రయోగాత్మక చిత్రాలకూ తానే కావాలి.. వీరనారి పాత్రలకూ అనుష్కనే ఆప్షన్. అనుష్క ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. అనుష్క కోసం కొత్త కొత్త పాత్రలు, కథలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి అనుష్క ఒకప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకొందట. ‘నేను సినిమాలకు పనికిరాను’ అనుకొని పారిపోవాలనుకొందట. ఈ విషయాన్ని అనుష్కనే చెప్పుకొచ్చింది.
”తొలి సినిమా సూపర్ లో నటిస్తున్నప్పుడు ప్రతీ రోజూ గందరగోళంగా ఉండేది. దర్శకుడు ఏం చెబుతున్నారో, సెట్లో ఎలా ఉండాలో, డైలాగ్ ఎలా పలకాలో అర్థమయ్యేది కాదు. నేను సినిమాలకు పనికి రాను అనిపించింది. ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోవాలనిపించింది. కనీసం సూపర్ అయ్యేంత వరకూ ఓపిక తెచ్చుకొని.. ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకొన్నా. ఆ సమయంలో పూరి జగన్నాథ్, నాగార్జున ఇచ్చిన సహకారం మర్చిపోలేను. వాళ్లే కనుక ఓపిగ్గా నన్ను భరించకుండా నా తొలి సినిమానే చివరి సినిమా అయ్యేది” అంటూ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయింది స్వీటీ.