తెలంగాణా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత కె. జానారెడ్డికి ఎనాటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది. తన మనసులో ఆ కోరికని శుక్రవారం నల్గొండ జిల్లా హాలియాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మరొక్కసారి బయటపెట్టుకొన్నారు. అయన కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రితో సమానమైన హోదా అనుభవిస్తున్న వాడిని నేనొక్కడినే. నా అనుభవమే నాకు ఆ అవకాశం కల్పిస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్పకుండా నేనే ముఖ్యమంత్రిని అవుతాను,” అని అన్నారు. ఆయనకి గతంలోనే అటువంటి అవకాశం చేతికి అందినట్లే అంది జారిపోయింది. అప్పటి నుంచి అది తీరని కోరికగానే మిగిలిపోయింది. ఆ కోరిక అప్పుడప్పుడు ఈవిధంగా బయటపడుతుంటుంది.
జానారెడ్డి చెప్పిన ఈ మాట విన్న తరువాత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణా కాంగ్రెస్ నేతలని ఉద్దేశ్యించి అన్న మాటలు గుర్తుకు చేసుకోక తప్పదు. “పార్టీలో ఇప్పుడు ఉన్న వారిలో కనీసం ఓ డజను మందికి పైగా తాము ముఖ్యమంత్రి పదవి చేపట్టవలసిన వాళ్ళమనే అభిప్రాయంతో ఉన్నారు. ఇంకా చాలా మంది తామే పిసిసి ప్రెసిడెంట్ పదవికి అన్ని విధాల అర్హులమని భావిస్తుంటారు. అందరూ కలిసి పార్టీని భ్రష్టు పట్టించేశారు. 2014 ఎన్నికలలో అందరూ కలిసి పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నించకుండా పిసిసి పదవి కోసం కుమ్ములాడుకోవడం చేతనే పార్టీ ఓడిపోయింది. మాజీ పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య చేతగానివాడనుకొంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కంటే చేతగానివాడని నిరూపించుకొంటున్నారు. అందరికీ పదవుల మీద యావే తప్ప పార్టీ గురించి శ్రద్ధ లేదు,” అని తీవ్ర విమర్శలు చేశారు.