మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి . దీంతో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను అధికారికంగా ప్రకటించారు. 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగుస్తుంది.
ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటన ఉంటుంది. తెనాలి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటు జనసేనకు త్యాగం చేశారు. ఐ.పోలవరం మండలానికి చెందిన రాజశేఖర్.. గతంలో ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. రాజశేఖర్ కాపు సామాజికవర్గానికి చెందిన వారు.
వైసీపీ తరపున విజయవాడ, గుంటూరు స్థానాలకు గౌతంరెడ్డిని ఖరారు చేశారు. మరో స్థానానికి పేరుపై ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది. గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం పాలైంది. ఈ ఎన్నికలూ బ్యాలెట్ తో జరగనున్నాయి. వైసీపీ ఈవీఎం వాదనను పరీక్షించే ఎన్నికలు వచ్చేశాయని అనుకోవచ్చు.