అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ మిస్సింగ్, ఆపై అనుమానస్పద మృతి కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. దళిత యువకుడిది హత్యే అని పినిపే శ్రీకాంత్ దుర్గాప్రసాద్‌ను హత్య చేశారని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేష్ అనే యువకుడు పోలీసుల విచారణలో వెల్లడించారు ఈ కేసు మొత్తం వ్యవహారంలో మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.
అయినవిల్లి గ్రామానికి చెందిన జనుపల్లి దుర్గాప్రసాద్ అదే గ్రామంలో వాలంటీర్‌గా పనిచేసేవాడు. పినిపే విశ్వరూప్‌కు ఆరోగ్యం బాగోలేనప్పుడు నియోజకవర్గాన్ని ఆయనల కుమారుడు శ్రీకాంత్ చూసుకునేవారు. ఆ తర్వాత తనకు పి .గన్నవరం టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని చెబుతూ అక్కడ రాజకీయ పర్యటనలు చేశారు. ఆ సమయంలో దుర్గాప్రసాద్ అనుచరుడిగా మారారు. కొద్ది రోజుల్లోనే దుర్గాప్రసాద్ పినిపే శ్రీకాంత్ ముఖ్యఅనుచరుల్లో ఒకడుగా మారారు. అయితే 2022లో కోనసీమ అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యాడు.
నెల రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింది. దుర్గా ప్రసాద్ అల్లర్ల కేసులకు భయపడి ఎక్కడికో పారిపోయాడని ప్రచారం చేశారు . కానీ ముక్తేశ్వరం-కోటిపల్లి రేవు వద్ద దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటికే మృతుని భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదుకాగా అనుమానస్పద మృతిగా కేసు మార్చారు. అయితే పోస్ట్ మార్టం నివేదికలో మెడ ఎముక విరిగి మృతిచెందినట్లు వెల్లడి అయింది. అయితే అప్పట్లో విశ్వరూప్ మంత్రిగా ఉండంతో రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఆ కేసును పెండింగ్ ఉంచినట్లు తెలుస్తోంది.. అదే సమయంలో మరో దళత యువకుడి హత్య కూడా జరిగిందని అదికూడా రాజకీయ ఒత్తిళ్ల మేరకు పెండింగ్ లో ఉండిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వీటన్నింటిపై ఇప్పుడు విచారణ జరిపి అరెస్టు చేసి హత్య కేసు నిందితుల్ని అరెస్టు చేస్తున్నారు. పోలీసులకు విషయం తెలిసిపోయిందని అనుమానం రావడంతో విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పరారయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.