ప్రపంచ ప్రసిద్ది చెందిన పెప్సీ కూల్ డ్రింక్స్ సంస్థకి సీ.ఈ.ఓ.గా భారతదేశానికి చెందిన ఇంద్రానూయి, ఆ తరువాత మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు సత్య నాదెళ్ళ సీ.ఈ.ఓ.గా నియమించబడటంతో అంతర్జాతీయ సంస్థలపై భారతీయుల ఆధిపత్యం మొదలయింది. ఇంకా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలలో భారతీయులే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో తాజాగా చెన్నై కి చెందిన సుందర్ పిచాయ్ పేరు కూడా చేరిందిప్పుడు. ఇంటర్నెట్ కి పర్యాయపదంగా మారిన గూగుల్ సంస్థకి ఆయన సీ.ఈ.ఓ.గా నియమితులయ్యారు. గూగుల్ వ్యవస్థాపకులయిన ల్యారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ తమ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో నుండి గూగుల్ ని వేరు చేసి దానికి సుందర్ పిచాయ్ ని సీ.ఈ.ఓ.గా నియమించారు.
సుందర్ పిచాయ్ (43) స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. తరువాత ఐఐటి ఖరగ్ పూర్ లో ఆయన తన మెటలర్జీలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసారు. ఆ తరువాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎం.యస్. వార్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సల్వేనియాలో ఎం.బి.ఏ. పూర్తి చేసారు. ఆ తరువాత ఆయన అమెరికాలోని మెక్ కిన్సి అండ్ కంపెనీలో ఇంజనీరుగా కొంత కాలం పనిచేసారు. 2004లో గూగుల్ కంపనీలో ప్రవేశించి తన ప్రతిభను చాటుకొంటూ అంచలంచెలుగా ఎదుగుతూ నేడు ఆ సంస్థకే సీ.ఈ.ఓ.గా నియమితులయ్యారు.
ఇంతకు ముందు ఆయన గూగుల్ సంస్థలో క్రోమ్ మరియు ఆండ్రాయిడ్ విభాగాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆవిష్కరణలో ఆయనదే కీలక పాత్ర. అంతే కాదు గూగుల్ అందిస్తున్న గూగుల్ మ్యాప్స్, జీ మెయిల్ వంటి వాటికి ఎప్పటికప్పుడు అధనపు హంగులను జోడించడంలోను ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్ముందు మరిన్ని విన్నూత్నమయిన ఆవిష్కరణల కోసం ఆయన నిరనతరం శ్రమిస్తున్నారు. ఆయన భార్య పేరు అంజలి. ఆ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.