ఓ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలి. నచ్చకపోతే సైలెంట్ గా ఉండాలి. ఇంకా వ్యతిరేకం అయితే పార్టీకి రాజీనామా చేసి సొంత పోరాటం చేయాలి. కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మాత్రం అన్నింటికీ అతీతం. తాను ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీని రోడ్డుకీడుస్తారు. నిర్మోహమాటంగా విమర్శలు చేస్తారు. గ్రూప్ వన్ విషయంలోనూ అదే చేస్తున్నారు.
జీవో 29ని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంటోంది. అందరూ ఒకటే మాట వినిపిస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం సొంత ప్రభుత్వంపై బీసీ సంఘాలను తీసుకుని పోయి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ పరీక్షఉండేది కాదనేశారు. కోర్టులో నిలబడదని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఉండి ఇలా మాట్లాడటం ఏమిటని వచ్చే ప్రశ్నలకూ ఆయన ముందుగానే సమాధానం ఇచ్చారు. కులాల ప్రాతినిధ్యం వారీగా అవకాశాలు రావాలని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని చెప్పుకొస్తున్నారు.
తీన్మార్ మల్లన్న వ్యవహారంతో .. ఆయనను పార్టీలో ప్రోత్సహించిన వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ తరపున టిక్కెట్ ఇప్పించి మరీ ఎమ్మెల్సీగా పోటీ చేసే చాన్స్ ఇప్పిస్తే విజయం సాధించిన తర్వాత ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిపై ఆయనకు ఎక్కడో కోపం వచ్చిందని.. అందుకే ఇలా చేస్తున్నాడని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.