‘సీతారామం’తో తెలుగు హీరో అయిపోయాడు దుల్కర్ సల్మాన్. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే తెలుగు ఆడియన్స్ అంతా అలెర్ట్ అయిపోతారు. ముఖ్యంగా దుల్కర్‌కు లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వాళ్లంతా ‘లక్కీ భాస్కర్’ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రమిది. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకుడు. ఈనెల 31న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్లో కథేమిటో, హీరో క్యారెక్టర్ ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు. భాస్కర్ ఓ బ్యాంకు ఉద్యోగి. ఆరు వేల జీతం. అయితే.. సడన్‌గా లక్షాధికారి అయిపోతాడు. ఇదంతా ఎలా జరిగింది? భాస్కర్ జూదం ఆడాడా? మాఫియాతో చేతులు కలిపాడా? లాటరీ ఏమైనా తగిలిందా? లేదంటే ఓ సామాన్య ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్టుండి లక్షలెలా సంపాదించాడు? ఇలా ఆసక్తిగొలిపేలా ట్రైలర్ కట్ చేశారు.
‘జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు.. ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం’
‘ఐ యామ్ నాట్ బ్యాడ్.. ఐయామ్ రిచ్’
‘సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కన్నా, డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ’
‘వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిపై ఉండాలి…’ లాంటి డైలాగులు ఆకట్టుకొన్నాయి.
1980ల్లో జరిగిన కథ ఇది. ఆ వాతావరణం తెరపై ప్రతిబింబించింది. కెమెరా వర్క్, నేపథ్య సంగీతం కథని మరింత ఎలివేట్ చేశాయి. మీనాక్షికి సైతం మంచి పాత్ర పడినట్టు అనిపించింది. ఈ దీపావళికి బాక్సాఫీసు ముందుకు రానుంది ఈ చిత్రం. ఒక రోజు ముందే ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఈ పండక్కి కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లడానికి ఇదో మంచి ఆప్షన్.